టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన రీతిలో ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఘోర పరాజయాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఓటమికి కారణమైన ఆటగాళ్లపై ఫన్నీ మీమ్స్, జోక్స్ ట్రెండ్ చేస్తున్నారు.
ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా ఆదివారం ముగిసిన ఐదో టెస్ట్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ పరాజయంతో 10 ఏళ్ల తర్వాత ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసీస్‌కు కోల్పోయింది. అంతేకాకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి కూడా తప్పుకుంది. తప్పక గెలవాల్సిన సిడ్నీ టెస్ట్‌లో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం, జస్‌ప్రీత్ బుమ్రా గాయం విజయవకాశాలను దెబ్బతీసింది.

ముఖ్యంగా ఎన్నో అంచనాలతో ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. ఐదు టెస్ట్‌ల్లో ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలకే ఔటయ్యాడు. పెర్త్ టెస్ట్ సెంచరీ మినహా మరే మ్యాచ్‌లోనూ కోహ్లీ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఊరించే ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌కు వికెట్ పారేసుకున్నాడు.
ఈ సిరీస్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ వరుసగా 5, 100 నాటౌట్, 7, 11, 3, 36, 5, 17, 6 పరుగులతో మొత్తం 190 పరుగులే చేశాడు. కోహ్లీ వైఫల్యం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ క్రమంలోనే కోహ్లీ బ్యాటింగ్‌పై నెటిజన్ల ఫన్నీ రీల్స్, మీమ్స్ సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ చేస్తున్నారు.
ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బలహీనతను అధిగమించేందుకు కోహ్లీ కోసం ప్రత్యేకమైన బ్యాట్‌ను రూపొందించినట్లు రీల్స్ క్రియేట్ చేశారు. బ్యాట్ సైడ్ ఎడ్జ్‌లను బంతి తాకకుండా వెళ్లేలా కట్ చేశారు. ప్రస్తుతం ఈ రీల్స్ నవ్వులు పూయిస్తుండగా.. కోహ్లీ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఇంగిత జ్ఞానం లేకుండా స్టార్ ఆటగాడిని అవమానిస్తారా? అంటూ మండిపడుతున్నారు. ఫామ్ కోల్పోవడం ఏ ఆటగాడికైనా సహజమేనని, ఒక్క సిరీస్‌లో విఫలమైనంత మాత్రానా అంతలా విమర్శించడం సరికాదని హితవు పలుకుతున్నారు.