
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ ప్రకటించిన తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మపై వేటు వేసి యువ ఆటగాళ్లు అయిన కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లకు అవకాశం ఇవ్వాలని విరాట్ కోహ్లీ సెలెక్టర్లను కోరినట్లు ప్రచారం జరుగుతుండగా.. తాజాగా మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.
ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ కోసం శిఖర్ ధావన్‌ను జట్టులోకి తీసుకోవాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ సెలెక్టర్లతో వాగ్వాదానికి దిగాడంట. ఈ విషయాన్ని బోర్డుకు చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపాడు. 'ఈ ఏడాది మార్చి-ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్ ఎంపిక చేయాలని కోహ్లీ సెలెక్టర్లతో వాదించాడు. అయితే సెలెక్టర్లు మాత్రం విజయ్ హజారే ట్రోఫీలో రాణించిన ఓపెనర్‌ను తీసుకోవాలని భావించారు.
కానీ టీ20 జట్టులో అప్పటికే చోటు కోల్పోయిన ధావన్ కావాలని కోహ్లీ పట్టుబట్టాడు. ఆ తర్వాత శ్రీలంక పర్యటనకు పంపించిన బీ టీమ్‌కు ధావన్‌ను కెప్టెన్ చేయడం వేరే విషయం. కానీ మార్చిలో జరిగే ఆ సమావేశం చాలా వేడిగా సాగింది. జట్టును ఎంపిక చేసిన తర్వాత ప్రకటన చేయడానికి ఏకాభిప్రాయం కోసం బీసీసీఐ ఐదు రోజుల పాటు వేచి చూడాల్సి వచ్చింది.'అని సదరు అధికారి పేర్కొన్నాడు.
ఇక కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించే ముందు విరాట్ కోహ్లీ.. బీసీసీఐ పెద్దలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. 'ట్విటర్ వేదికగా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానే నిర్ణయాన్ని ప్రకటించే కొన్ని గంటల ముందు విరాట్.. బీసీసీఐ సెక్రటరీ జైషాతో మాట్లాడాడు. బ్యాటింగ్‌పై దృష్టిసారించేందుకు టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. భారత కెప్టెన్‌తో మాట్లాడిన వెంటనే జైషా.. సెలెక్షన్ కమిటీతో సమావేశం ఏర్పాటు చేశాడు.
ఆ వర్చువల్ మీటింగ్‌లోనే కోహ్లీ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఈ మీటింగ్‌కు ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ అతని ప్యానెల్ హాజరైంది. భారత టీ20 టీమ్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి అధికారులకు తగినంత సమయం ఇవ్వాలనే ప్రపంచకప్ తర్వాత తప్పుకోవాలనుకుంటున్నానని కోహ్లీ బోర్డుకు స్పష్టం చేశాడు.'అని మరో బీసీసీఐ అధికారి వెల్లడించాడు.
అయితే ఈ వార్తలు అవాస్తవమని కొట్టిపారేయలేని పరిస్థితి భారత క్రికెట్‌లో నెలకొంది. ఇటీవల కాలంలో బోర్డు నుంచి వస్తున్న లీకులన్నీ నిజమే అవుతున్నాయి. గత సోమవారమే విరాట్ కోహ్లీ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని, రోహిత్ శర్మ భారత జట్టు బాధ్యతలను స్వీకరిస్తాడని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అవన్నీ పుకార్లేనని బీసీసీఐ కొట్టిపారేసింది. మూడు ఫార్మాట్లలో కోహ్లీనే కెప్టెన్‌గా కొనసాగుతాడని స్పష్టం చేసింది. కానీ రెండు రోజుల వ్యవధిలోనే విరాట్ కోహ్లీనే స్వయంగా టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని తెలిపాడు. దాంతో బోర్డు అధికారులు అందిస్తున్న సమాచారం వాస్తవాలేనని స్పష్టమైంది.