IND vs SL: 12 గంటల ముందే విరాట్ కోహ్లీ వికెట్‌పై జ్యోస్యం.. సంచలనంగా మారిన ట్వీట్! సెహ్వాగ్ సైతం..

మొహాలీ: కెరీర్‌లో 100వ టెస్ట్ ఆడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఓ ట్విటర్ యూజర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. శ్రీలంకతో మొహాలీ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌తో విరాట్ ఈ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఔటయ్యే విషయాన్ని సదరు యూజర్ 12 గంటల ముందే చెప్పాడు. అయితే ఇలా అంచనా వేయడంలో వింతేం ఉందనుకుంటే పొరపాటే. ఇక్కడ సదరు యూజర్ చెప్పిన రీతిలోనే కోహ్లీ ఔటవ్వడం అందర్నీ విస్మయపరుస్తుంది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట చర్చనీయాంశమైంది. ఎంతలా అంటే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు పేరు మోసిన క్రికెట్ విశ్లేషకులు కూడా అవాక్కయ్యేంత పాపులర్ అయింది.
అసలు ఆ ట్వీట్ ఏంటంటే..?
క్విక్ సింగిల్ పేరుతో ఒక ట్విటర్ యూజర్ విరాట్ కోహ్లీ ఔటయ్యే విషయాన్ని రాసుకొచ్చాడు.'విరాట్ కోహ్లీ 100వ టెస్టులో సెంచరీ చేయలేడు. 100 బంతుల్లో 45 పరుగులు చేసి శ్రీలంక బౌలర్ ఎంబుల్డేనియా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అవుతాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో నాలుగు అద్భుతమైన కవర్‌డ్రైవ్‌లు ఉంటాయి. తాను ఔటైన రీతిపై కోహ్లీ షాక్‌కు గురవుతాడు. ఆ తర్వాత తన తలను అడ్డంగా ఊపుకుంటూ నిరాశతో పెవిలియన్ చేరుతాడు.'అంటూ రాసుకొచ్చాడు.
ట్వీట్‌లో రాసుకొచ్చినట్లే..
అయితే సదరు యూజర్ చెప్పినట్లే విరాట్ కోహ్లీ శ్రీలంక స్పిన్నర్ లసిత్ ఎంబుల్దేనియా బౌలింగ్‌లో 45 పరుగుల వద్దే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే అతను చెప్పినట్లు 100 బంతులు ఆడలేదు. అంతేకాకుండా నాలుగు కవర్ డ్రైవ్స్ షాట్స్ కూడా కొట్టలేదు. విరాట్ ఐదు బౌండరీలు బాదాడు. ఇక చివర్లో కోహ్లీ తన ఔట్‌పై షాకవ్వడం.. ఆ తర్వాత తలను అడ్డంగా ఊపుతూ పెవిలియన్ చేరడం మాత్రం అతను చెప్పినట్లే జరిగాయి. దాంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఏదో ట్రిక్ వాడాడని కొందరు లైట్ తీసుకోగా.. మరికొందరు మాత్రం అతన్ని జోస్యాన్ని కొనియాడుతున్నారు.

సెహ్వాగ్ సైతం..
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం సదరు యూజర్ ప్రిడిక్షన్‌ను రీట్వీట్ చేస్తూ వావ్ అని క్యాప్షన్ ఇచ్చాడు. దాంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే 40 వేల లైక్స్ అందుకుంది. ఇక సదరు యూజర్‌ను జ్యోతిష్యుడిగా భావిస్తున్న అభిమానులు తమకు తోచిన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పరిస్థితులపై భవిష్యత్తు ఏంటని అడగడం మొదలుపెట్టేశారు. ఒకరేమో యూసీఎల్‌ను బార్కా గెలుచుకుంటుందా అని.. మరొకరేమో.. ఏ స్టాక్స్ కొంటే లాభాల్లోకి వస్తామో చెప్పమంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

భారత్ 357/6..
సూపర్ బ్యాటింగ్‌తో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 85 ఓవర్లలో 6 వికెట్లకు 357 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(45 బ్యాటింగ్)తో పాటు రవిచంద్రన్ అశ్విన్(10 బ్యాటింగ్) ఉన్నారు. రిషభ్ పంత్(97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 96) తృటిలో శతకాన్ని చేజార్చుకోగా.. హనుమ విహారి(128 బంతుల్లో 5 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. 100వ టెస్ట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ(75 బంతుల్లో 5 ఫోర్లతో 45) మరోసారి సెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు. శ్రీలంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దెనియా రెండు వికెట్లు తీయగా.. సురంగ, విష్వా, లాహిరు, ధనంజయ డిసిల్వా తలో వికెట్ పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications