టఫ్ ఫేజ్‌లో విరాట్ కోహ్లీ.. కెప్టెన్సీ భారం లేకున్నా మారని ఆట!

హైదరాబాద్: 'ఇన్నాళ్లు కెప్టెన్‌గా ఉన్నావు కాబట్టి నడిచింది.. ఇక నుంచి కుదరదు. ఒళ్లు దగ్గరపెట్టుకొని బ్యాటింగ్ చేయాలి. లేకుంటే జట్టులో చోటు కోల్పోతావు'అని విరాట్ కోహ్లీకి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇచ్చిన వార్నింగ్. ఇది అక్షరాల నిజం. విరాట్ కోహ్లీ మెరుగ్గా రాణించకపోతే తుది జట్టులో కూడా చోటు కోల్పోయే ప్రమాదం ఉంది.
కెప్టెన్‌గా భారత జట్టుకు ఎంతో చేసిన కోహ్లీ.. ఇటీవల అనూహ్య పరిణామాలతో మూడు ఫార్మాట్లలో సారథ్య బాధ్యతలు వదిలేశాడు. అందుకు దారి తీసిన కారణాలేంటి, ఇందులో ఎవరిది తప్పు అన్నది పక్కన పెట్టేస్తే.. నాయకత్వ భారం దిగిపోయింది కాబట్టి.. ఇక బ్యాటుతో చెలరేగిపోతాడని అంతా అనుకున్నారు.

రెండు హాఫ్ సెంచరీలు చేసినా..
కానీ అభిమానులకు నిరాశే ఎదురైంది. సఫారీలతో వన్డే సిరీస్‌లో అతను రెండు హాఫ్ సెంచరీలతోనే సరిపెట్టాడు. అవి కూడా ఒకప్పటంతా సాధికారిక ఇన్నింగ్స్‌లు కావు. క్రీజులో మునుపటిలా సౌకర్యంగా కోహ్లీ కనిపించట్లేదు. స్వేచ్ఛగా షాట్లు ఆడలేకపోతున్నాడు. ఇన్నింగ్స్‌లో వేగం ఉండట్లేదు. కోహ్లీ బ్యాట్ నుంచి మూడంకెల స్కోరు కోసం రెండేళ్లకు పైగా నిరీక్షించాల్సి రావడం అనూహ్యం. కెప్టెన్సీ వివాదంతో విరాట్ కోహ్లీ మానసికంగా మరింత దెబ్బ తిన్నట్లుంది అతడి వాలకం చూస్తుంటే. క్రికెటర్‌గా కోహ్లీ ప్రస్తుతం టఫ్ ఫేజ్‌లో ఉన్నాడు.

తీవ్ర ఒత్తిడిలో కింగ్..
మూడో టెస్ట్‌లో 79 రన్స్‌తో బాగా ఆడిన విరాట్.. ఆ తర్వాత ఆ జోరు చూపించలేకపోయాడు. ప్రస్తుతానికి టీమ్‌లో సాధారణ ప్లేయర్‌గా కనిపిస్తున్నాడు. ఏ పరిస్థితి నుంచి అయినా టీమ్‌ను గట్టెక్కించే, అందరూ కోరుకునే కింగ్ కోహ్లీ కనిపించడం లేదు. మూడో టెస్ట్‌లో రాంగ్ డీఆర్‌ఎస్ విషయంలో ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం చూస్తే తాను చాలా ఒత్తిడిలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. మునుపటి ఫామ్ అందుకుంటాడన్న ఆశలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. మళ్లీ ఒకప్పటి కోహ్లీని చూస్తామో లేదో? అనే సందేహం కలుగుతోంది.

జట్టంతా ఆగమాగం..
భారత క్రికెట్లో కెప్టెన్సీ గురించి చివరగా పెద్ద చర్చ జరిగిందంటే.. సౌరవ్ గంగూలీపై వేటు పడ్డపుడే. మళ్లీ ఇప్పుడు నాయకత్వ మార్పు పెద్ద వివాదంగా మారింది. కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తప్పించడం ఇప్పుడు భారత క్రికెట్‌నే ఒక సందిగ్ధ స్థితికి తీసుకొచ్చింది. తనతో సెలక్టర్లు, బీసీసీఐ వ్యవహరించిన తీరుతో మనస్తాపానికి గురై టెస్టు పగ్గాలు కూడా వదిలేశాడు కోహ్లీ.
ఇప్పుడు టెస్టు కెప్టెన్ ఎవరు అనే అయోమయం అందరిలోనూ నెలకొంది. టెస్టుల్లో రోహిత్ ఇంకా స్థిరత్వం సాధించేలేదు. ఈ నేపథ్యంలో రాహుల్‌కు అవకాశం దక్కుతుందనుకున్నారు. కానీ జట్టును నడిపించిన ఒక టెస్టు మ్యాచ్‌లో, ఆ తర్వాత వన్డే సిరీస్‌లో కెప్టెన్‌గా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో కోహ్లీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

పంత్, అయ్యర్ మారాలి..
రిషభ్ పంత్ బ్యాటింగ్ అప్రోచ్ ఎవ్వరికి అర్థం కావడం లేదు. రెండు మ్యాచ్‌ల్లో నిర్లక్ష్యమైన షాట్లు ఆడి వికెట్ పారేసుకునే రిషభ్.. తాను ఆడాలనుకున్న ఓ మ్యాచ్‌లో మాత్రం హిట్ అవుతున్నట్టు అనిపిస్తోంది. కానీ, టీమ్ ముందుకెళ్లాలంటే నిలకడ అవసరం. కొంచెం ఓపిగ్గా ఆడటం నేర్చుకుంటే పంత్ నుంచి రెగ్యులర్ హిట్స్ చూడొచ్చు. ఇక, మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్‌తోనే పెద్ద సమస్య ఉంది.
షార్ట్ బాల్స్ ఆడేప్పుడు అతని టెక్నికల్ వీక్‌నెస్ ఈ టూర్‌లో మరోసారి బయటపడింది. ఈ కారణం వల్లే టెస్ట్‌ల్లో పుజారా లేదా రహానెకు తనను రీప్లేస్‌మెంట్‌గా మేనేజ్‌మెంట్ భావించడం లేదు. యంగ్‌స్టర్స్‌కు టీమ్‌లో ప్లేస్‌పై సెక్యూరిటీ ఇస్తామని ద్రవిడ్ చెబుతున్న నేపథ్యంలో వైట్‌బాల్ ఫార్మాట్‌లో అయ్యర్‌కు మరికొన్ని అవకాశాలు రావొచ్చు. అదే టైమ్‌లో పెర్ఫామెన్స్ కూడా చేయాల్సిందే అని హెడ్ కోచ్ స్పష్టం చేశాడు. కాబట్టి షార్ట్ బాల్ వీక్‌నెస్ నుంచి శ్రేయస్ బయట పడాలె. లేదంటే టీమ్ నుంచి బయటికి పోవాల్సివస్తది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications