రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అభిమానులకు ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్ నిష్క్రమణ తర్వాత తొలిసారి స్పందించిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో సంచలన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరిన ఆర్‌సీబీ.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. ఈ సీజన్ ఫస్టాఫ్‌లో 8 మ్యాచ్‌లకు ఒకే ఒక్క విజయాన్నందుకున్న ఆర్‌సీబీ.. అసాధారణ ప్రదర్శనతో వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకుంది. కానీ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆ జోరును కొనసాగించలేకపోయారు. దాంతో ఆర్‌సీబీ అభిమానులకు మరోసారి కన్నీళ్లే మిగిలాయి.

ఈ ఓటమి అనంతరం మౌనంగా ఉన్న విరాట్ కోహ్లీ.. శుక్రవారం సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 'అభిమానులందరికీ కృతజ్ఞతలు. మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నందుకు. ఎల్లవేళలా ప్రోత్సహిస్తున్నందుకు స్పెషల్ థ్యాంక్స్'అని కోహ్లీ ఇన్‌స్టాలో పేర్కొన్నాడు.
ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ 15 మ్యాచ్‌లో 61.75 సగటుతో 741 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో గ్లేన్ మ్యాక్స్, దినేశ్ కార్తీక్ వైఫల్యం ఆర్‌సీబీ కొంపముంచింది. ముఖ్యంగా గ్లేన్ మ్యాక్స్ నిర్లక్ష్యపు షాట్ ఆర్‌సీబీ ఓటమికి కారణమైంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 33), రజత్ పటీదార్(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34), మహిపాల్ లోమ్రోర్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్) రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్(3/44) మూడు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ రెండు వికెట్లు తీసాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. యశస్వి జైస్వాల్(30 బంతుల్లో 8 ఫోర్లతో 45), రియాన్ పరాగ్(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36), షిమ్రాన్ హెట్‌మైర్(14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26) సత్తా చాటారు. చివర్లో రోవ్‌మన్ పోవెల్(8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 16 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.