Virat Kohli: అన్నా.. ఎప్పటికీ నేను నీ అభిమానినే! డివిలియర్స్ రిటైర్మెంట్‌పై కోహ్లీ భావోద్వేగం!

హైదరాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ ప్లేయర్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మూడేళ్ల క్రితమే అంతర్జాతీ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఏబీడీ ఫ్రాంచైజీ లీగ్స్ మాత్రం ఆడాడు. తాజాగా మొత్తం ఆటకే గుడ్‌బై చెబుతున్నానని ట్విటర్ వేదికగా ప్రకటించాడు. అయితే ఏబీడి నిర్ణయం పట్ల ఆర్‌సీబీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరో సీజన్ ఆడి ఘనంగా వీడ్కోలు పలుకుతాడని భావించిన వారికి ఏబీడీ షాకిచ్చాడు. ఇక ఆ ఫ్రాంచైజీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఏబీడీ రిటైర్మెంట్ నిర్ణయంపై భావోద్వేగానికి గురయ్యాడు. సోషల్ మీడియా వేదికగా జట్టుకు ఏబీడి అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఎప్పటికీ తాను ఏబీడీ నెంబర్ వన్ అభిమానినని పేర్కొన్నాడు.

అన్నా.. లవ్‌యూ!
'అన్నా.. ఆర్‌సీబీ కోసం నీ శక్తినంతా దారపోసావనే విషయం నా మనసుకు తెలుసు. ఈ ఫ్రాంచైజీకి నీవు చేసిన సేవలను మాటల్లో వర్ణించలేం. చిన్న స్వామి స్టేడియం నిన్ను మిస్సవ్వతుందన్నా. అలాగే నేను కూడా నీతో కలిసి ఆడే క్షణాలను మిస్సవుతా. నేను నిన్ను ఎప్పటీకీ ఆరాధిస్తూనే ఉంటా! అన్నా.. ఎప్పటికీ నీ నెంబర్ వన్ అభిమానిని నేనే'అని పేర్కొంటూ ఏబీడిని హగ్ చేసుకున్న ఫొటోను విరాట్ పంచుకున్నాడు. ఇక ఏబీడీ, విరాట్ కోహ్లీ మంచి మిత్రులనే విషయం తెలిసిందే. కెరీర్ పరంగానైనా.. వ్యక్తిగత జీవితంలోనైనా కీలక నిర్ణయాలు తీసుకునేముందు ఏబీడీ అభిప్రాయం తీసుకుంటానని కోహ్లీ గతంలో అనేకసార్లు తెలిపాడు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం కూడా అతని సూచనల ప్రకారమే జరిగిందన్నాడు.

ఒక శకం ముగిసింది..
ఏబీ డివిలియర్స్ అనూహ్య నిర్ణయంపై ఆర్‌సీబీ ఫ్రాంఛైజీ విచారం వ్యక్తం చేసింది. ఎన్నో ఏళ్లు ఆ జట్టుతో కలిసి ఆడిన అతను బెంగళూరు ఫ్రాంఛైజీలో కోహ్లీ తర్వాత అతికీలకమైన ఆటగాడిగా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే ఆర్‌సీబీ అతని సేవలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక శకం ముగిసిందని ట్వీట్ చేసింది. 'ఒక శకం ముగిసింది. నీలాంటి క్రికెటర్ మరొకరు లేరు. ఏబీడీ.. ఆర్‌సీబీలో లేకపోతే మేం కచ్చితంగా నిన్ను మిస్సవుతాం. మా జట్టును, అభిమానులను, క్రికెట్ ప్రేమికులను నువ్వు ఎంతగా అలరించావో అందరికీ తెలుసు. అందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు. హ్యాపీ రిటైర్మెంట్ లెజెండ్' అని భావోద్వేగ భరితంగా రాసుకొచ్చింది.

అందరికీ థ్యాంక్స్..
అంతకుముందు ఏబీడీ ఓ సుధీర్ఘ పోస్ట్ ద్వారా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ప్రపంచ వ్యాప్తంగా తనకు అవకాశం కల్పించిన అన్ని జట్లకూ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇన్నేళ్లు క్రికెటర్‌గా కొనసాగడం అద్భుతమైన ప్రయాణమని, కానీ.. ఇప్పుడు ఆటకు మొత్తానికే వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. 'నేను చిన్నప్పుడు మా సోదరులతో కలిసి క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి ఇప్పటివరకూ ఆటను ఎంతగానో ఆస్వాదించాను. ఇప్పుడు 37 ఏళ్ల వయసులో అలాంటి కసిలేదు. ఈ ఆట నాకెంతో ఇచ్చింది. టైటాన్స్, సౌతాఫ్రికా, ఆర్‌సీబీ ఇలా ఏ జట్టు తరఫున ఆడినా నాకు చాలా మంచి అవకాశాలు కల్పించింది. దీనికి ఎల్లవేళలా రుణపడి ఉంటాను. ఈ సందర్భంగా నాతో కలిసి పనిచేసిన, ఆడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
నేను సగం భారతీయుణ్ని
నేను ఎక్కడ ఆడినా మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా సౌతాఫ్రికా, భారత్‌లో విశేష గుర్తింపు దక్కింది. చివరగా నా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారం లేకపోతే ఇంతటి విజయం సాధ్యం కాదు. ఇకపై నా జీవితంలో మరో అధ్యాయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటా' అని డివిలియర్స్ ట్వీట్లు చేశాడు. ఇక ఆర్‌సీబీ పోస్టు చేసిన మరో వీడియోలో డివిలియర్స్ మాట్లాడుతూ.. నేను ఎప్పటికీ ఆర్‌సీబీ అభిమానిగానే ఉంటా. ఈ జట్టులోని ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులే. ఆటగాళ్లు వస్తారు. వెళతారు. కానీ, ఇక్కడుండే ప్రేమానురాగాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఇప్పుడు నేను హాఫ్ ఇండియన్ అయిపోయాను. అందుకు గర్వంగా ఉంది' అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications