బీసీసీఐ అధ్యక్షుడిగా విరాట్ కోహ్లీ కోచ్! జీతం ఎంతంటే..?
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ ఎంపికయ్యాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ పదవి కాలం ముగియడంతో ఆదివారం కొత్త ప్రెసిడెంట్‌ను ఎన్నుకున్నారు. ముంబై వేదికగా జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో 37వ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మిథున్ మన్హాస్.. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు.
ఎవరీ మిథున్ మన్హాస్..
45 ఏళ్ల మిథున్ మన్హాస్ ఢిల్లీ తరఫున 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 130 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డేవిల్స్, పుణే వారియర్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 55 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 45.82 సగటుతో 9714 పరుగులు చేసిన మిథున్.. టీ20ల్లో 1170 పరుగులు నమోదు చేశాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తొలి కెప్టెన్ మిథున్ మన్హాస్ కావడం విశేషం. అతని సారథ్యంలోనే కోహ్లీ రంజీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. మిథున్ మన్హాస్ సారథ్యంలోనే ఢిల్లీ జట్టు 2007-08 సీజన్ రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత టైటిల్ అందుకుంది. ఈ సీజన్‌లో మిథున్ మన్హాస్ 57.57 సగటుతో 921 పరుగులు చేశాడు. 2016లో ఆటకు వీడ్కోలు పలికిన మిథున్.. ఆర్‌సీబీ అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.
ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా..
బీసీసీఐ అధ్యక్ష, ఉపాధ్యక్షుడి పదవులతో పాటు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ట్రెజరర్ స్థానాలకు ఒకే ప్యానెల్ నామినేషన్ దాఖలు చేసింది. దాంతో మిథున్ మన్హాస్ అధ్యక్షుడు కాగా.. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌గా రాజీవ్ శుక్లా, సెక్రటరీగా దేవజిత్ సైకియా తిరిగి ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా ప్రభ్ తేజ్ సింగ్ భాటియా, కోశాధికారిగా రఘురామ్ భట్ ఎన్నికైనట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అపెక్స్ కౌన్సిల్‌లో ఇప్పటి వరకు జయ్‌దేవ్ నిరంజన్ ఏక సభ్యుడిగా ఉన్నారు. తాజాగా బీసీసీఐ మరో ఇద్దరిని ఎంపిక చేసింది. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధమాల్‌తో పాటు కైరుల్ జమాల్ మజుందార్ గవర్నింగ్ కౌన్సిల్‌లోకి వచ్చారు.
బీసీసీఐ అధ్యక్షుడి జీతం ఎంతంటే..?
బీసీసీఐ ప్రెసిడెంట్‌కు స్థిరమైన నెల జీతం అంటూ ఏమీ ఉండదు. ఈ పదవిని గౌరవప్రదమైనదిగా పరిగణిస్తారు. అధ్యక్షుడికి అధికార విధుల్లో భాగంగా సమావేశాలకు హజరైనందుకు, పర్యటనలకు వెళ్లినందుకు రోజువారీ అలవెన్సులు, ఇతర సౌకర్యాలు ఉంటాయి.
బీసీసీఐ అధ్యక్షుడికి లభించే అలవెన్సులు, సౌకర్యాల:
- స్వదేశంలో జరిగే సమావేశాల కోసం రోజువారీ అలవెన్స్ సుమారు రూ. 40,000 వరకు.
- స్వదేశంలో ఇతర అధికారిక ప్రయాణాలకు రోజువారీ అలవెన్స్ దాదాపు రూ. 30,000 వరకు.
- అంతర్జాతీయ ప్రయాణాలు, ఇతర సమావేశాల కోసం రోజువారీ అలవెన్స్: సుమారు రూ.84,000 వరకు.
- ప్రయాణ సౌకర్యాలు: దేశీయ ప్రయాణాలకు బిజినెస్ క్లాస్, అంతర్జాతీయ ప్రయాణాలకు ఫస్ట్-క్లాస్, బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు. స్టార్ హోటళ్లలో విలాసవంతమైన గదులు బుక్ చేయడంతో పాటు అధికారిక విధుల్లో అయ్యే ప్రయాణం, ఇతర అనుబంధ ఖర్చులను పూర్తిగా బీసీసీఐ భరిస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications