WTC Final బెస్టాఫ్ 3 బెటర్.. ఒక్క విజయంతో అత్యుత టీమ్ అంటే అంగీకరించను: విరాట్ కోహ్లీ

సౌతాంప్టన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌ను బెస్టాఫ్ 3 ఫార్మాట్‌లో నిర్వహించాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఒక్క మ్యాచ్‌తో ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు జట్టును ఎంపిక చేయడం అనే విషయాన్ని తాను అంగీకరించనని చెప్పాడు. ఫైనల్లో ఒకటి కాకుండా మూడు మ్యాచ్‌లు నిర్వహించాలని, అప్పుడు ఎవరు బాగా ఆడితే వారిని విజేతగా గుర్తించాలని కోహ్లీ సూచించాడు. ఐసీసీ తొలిసారి నిర్వహించిన డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం వర్చువల్ మీడియా సమావేశంలో కోహ్లీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

బెస్టాఫ్ 3 బెటర్..
'ఒకవేళ ఫైనల్‌ను టెస్టు సిరీస్‌గా నిర్వహిస్తే.. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు ఏర్పాటు చేయాలి. అక్కడ ఎవరు బాగా ఆడితే వారిని విజేతగా ప్రకటించాలి. ఒక మ్యాచ్‌లో ఓడిన జట్టు తర్వాత పుంజుకుంటుందా లేక పూర్తిగా విఫలమవుతుందా? అనేది పరీక్షించాలి. ఈ విషయంపై ఐసీసీ దృష్టిసారించాలి. భవిష్యత్‌లో కచ్చితంగా దానికోసం కసరత్తు చేయాలి. మూడు మ్యాచ్‌లు నిర్వహిస్తే ఇరు జట్ల ఆటగాళ్ల బలాబలాలు తెలుస్తాయి. పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి. ఒకసారి ఆటలో వెనుకబడ్డా మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది. ఒక మ్యాచ్‌లో చేసిన తప్పులు మరో మ్యాచ్‌లో సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

బలమైన టీమ్‌ను రెడీ చేస్తాం..
'మా తప్పిదాలను సమీక్షించుకుంటాం. అన్ని రకాల బంతులు, విభిన్న రకాల వాతావరణంలో ఆడగలిగేలా టీమిండియాను సిద్దం చేస్తాం. ఈ ప్రణాళికలు అమలు చేసేందుకు మేం ఏడాది సమయమేమీ తీసుకోం. వెంటనే చర్యలు ప్రారంభిస్తాం. మా పరిమిత ఓవర్ల జట్టును చూడండి. ఆటగాళ్లు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. దేనికైనా సిద్ధమే అంటారు. టెస్టు జట్టులోనూ అలాంటి మార్పులు తీసుకురావడం అవసరం. టీమ్ రాణించేందుకు, నిర్భయంగా ఆడేందుకు ఏం చేయాలో కనుక్కోవాల్సి అవసరం ఉంది. సరైన వైఖరితో ఆడగలిగే ఆటగాళ్లను జట్టులోకి తీసుకురావాలి. ఎక్కువ పరుగులు చేసేందుకు మేం ప్రణాళికలతో ముందుకు రావాలి. మరీ వ్యత్యాసం రాకుండా జోరు కొనసాగించాలి. టెక్నికల్‌గా ఇబ్బందులు ఉన్నట్టు నాకైతే అనిపించడం లేదు.

నిర్భయంగా ఆడేలా..
ఆట, పరిస్థితులపై మాకు మరింత అవగాహన అవసరం. బౌలర్లు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టకుండా నిర్భయంగా ఆడాలి. తొలిరోజు మాదిరిగా మరీ స్వింగైతే, చల్లని వాతావరణం ఉంటే తప్ప బౌలర్లు ఒకే ప్రాంతాల్లో బంతులు వేయకుండా అడ్డుకోవాలి. వారు లెంగ్త్ మార్చుకునేలా దూకుడుగా కనబర్చాలి. పరీక్షించే పరిస్థితుల్లో ఔటవ్వడం గురించి ఆలోచించొద్దు. పరుగులు చేయడంపై దృష్టి పెట్టాలి. అలా చేస్తేనే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టగలం. లేదంటే ఔటవ్వకుండా ఉండాలని కోరుకోవడమే మిగులుతుంది. న్యూజిలాండ్ తరహా నాణ్యమైన బౌలింగ్‌లో అనుగుణమైన రిస్క్‌ను తీసుకోవడం ముఖ్యం' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

బాధేం లేదు..
చివరగా ఈ ఫైనల్లో ఓటమిపై స్పందిస్తూ.. ప్రతికూల ఫలితం గురించి తాము పెద్దగా బాధపడటం లేదని చెప్పాడు. ఎందుకంటే.. గత మూడు నాలుగేళ్లుగా టీమిండియా ఒక టెస్టు జట్టుగా ఏం సాధించిందనే విషయాలు తాము అర్థం చేసుకున్నామని తెలిపాడు. కేవలం ఈ చాంపియన్‌షిప్ పోటీల్లోనే కాకుండా అంతకుముందు నుంచే బాగా ఆడుతున్నామని గుర్తు చేశాడు. దాంతో గత కొన్నాళ్లుగా తాము సాధిస్తున్న ఫలితాలు, తమ శక్తి సామర్థ్యాలను ఈ ఒక్క ఓటమితో పోల్చి చూడలేమన్నాడు. తాము ఓడినందుకు ఈ మాటలు చెప్పడం లేదని, టెస్టు క్రికెట్ మంచి కోసమే అని పేర్కొన్నాడు. ఈ పోటీలు మరింత తీపిగుర్తుగా ఉండాలని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications