టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'గెడ్డం తెల్లబడింది.. ఇంకేం ఆడమంటావ్'అని నవ్వులు పూయించాడు. ప్రస్తుతం కోహ్లీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఐపీఎల్ 2025 సీజన్ సందర్భంగా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటకు ముందు ఆకస్మాత్తుగా తనకు ఎంతో ఇష్టమైన టెస్ట్ క్రికెట్‌కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన వారం వ్యవధిలోనే కోహ్లీ తన నిర్ణయాన్ని ప్రకటించడంతో అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.
కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండానే శుభ్‌మన్ గిల్ సారథ్యంలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. కోహ్లీ లేని లోటును గిల్ తన బ్యాటింగ్‌తో భర్తీ చేశాడు. దాంతో తొలి టెస్ట్‌లో ఓడిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో చారిత్రాత్మక విజయాన్నందుకుంది. తాజాగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ ఫౌండేషన్ యూవీకెన్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి విరాట్ కోహ్లీ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. అతనితో పాటు ఈ కార్యక్రమానికి క్రిస్ గేల్, ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, దిగ్గజ ఆటగాళ్లు రవి శాస్త్రి, సచిన్ టెండూల్కర్, కెవిన్ పీటర్సన్, బ్రియన్ లారా, ఆశిష్ నెహ్రాలు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా హోస్ట్ గౌరవ్ కపూర్.. విరాట్ కోహ్లీని స్టేజీపైకి ఆహ్వానించాడు. మైదానంలో విరాట్ కోహ్లీని ప్రతీ ఒక్కరు మిస్సవుతున్నారని, రిటైర్మెంట్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించాడు. అందుకు కోహ్లీ సరదా వ్యాఖ్యలతో నవ్వులు పూయించాడు.
'రెండు రోజుల క్రితమే నా గడ్డానికి కలర్ వేసుకున్నాను. ఇంకేం ఆడమంటావ్. ప్రతీ నాలుగు రోజులకు ఒకసారి గెడ్డానికి రంగు వేసుకోవాల్సి వచ్చిందంటే.. ఆటకు వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం' అని నవ్వుతూ బదులిచ్చాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ.. రవి శాస్త్రికి ధన్యావాదాలు తెలిపాడు. తన టెస్ట్ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారని, ఆయనే లేకుంటే టెస్ట్ క్రికెట్‌లో తాను సాధించిన ఘనతలను అందుకునేవాడిని కాదన్నాడు.
'నిజాయితీగా చెప్పాలంటే.. రవి శాస్త్రి లేకుంటే టెస్ట్ క్రికెట్‌లో నేను అందుకున్న ఘనతలు ఏవి సాధ్యమయ్యేవి కావు. మా ఇద్దరి మధ్య ఉన్న క్లారిటీని కనుగోవడం చాలా కష్టం. క్రికెటర్లు తమ కెరీర్‌లో ఎదగడానికి ఇలాంటి మద్దతు చాలా ముఖ్యం. నా కోసం ప్రెస్ కాన్ఫరెన్స్‌ల్లో విమర్శలు ఎదుర్కొన్నాడు. నా క్రికెట్ ప్రయాణంలో రవి శాస్త్రి కీలకమైన వ్యక్తి. ఆయన పట్ల నాకు ఎల్లప్పుడూ గౌరవం ఉంటుంది.'అని కోహ్లీ స్పష్టం చేశాడు.
కెరీర్ ఆరంభంలో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్‌లతో తనకు మంచి సంబంధం ఉండేదని గుర్తు చేసుకున్నాడు. 'మైదానం బయట, లోపల సీనియర్ ఆటగాళ్లతో నాకు మంచి రిలేషన్ ఉండేది. బెంగళూరులో జరిగిన నార్త్ జోన్ టోర్నీలో తొలిసారి నేను యువరాజ్ సింగ్‌ను కలిసాను. నేను భారత తరఫున ఆడటం ప్రారంభించనప్పుడు భజ్జు పా, జహీర్ ఖాన్ నాకు అండగా నిలిచారు. ఆటగాడిగా ఎదిగేందుకు సాయపడ్డారు. డ్రెస్సింగ్ రూమ్‌లో నన్ను బాగా చూసుకున్నారు. మైదానం బయట కూడా చాలా సరదాగా ఉండేవారు. లైఫ్ స్టైల్ గురించి అవగాహన కల్పించారు. వారితో ఉన్న బంధాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను.
ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ ప్రదర్శన ఎంతో ప్రత్యేకమైది. ఆ తర్వాత అతను క్యాన్సర్ బారిన పడి జట్టుకు దూరమయ్యాడు. అయితే ఓ ఛాంపియన్‌గా క్యాన్సర్‌తో పోరాడి నా సారథ్యంలో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో కటక్ వేదికగా ధోనీ, యువరాజ్ సింగ్ సెంచరీలు చేయడం నాకింకా గుర్తుంది. 'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో అద్భుతంగా రాణించిన శుభ్‌మన్ గిల్‌పై కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. భవిష్యత్తు మరింత రాణించాలని ఆకాంక్షించాడు.