న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో కాకుండా సంపాదనలోనూ రికార్డుల మోత మోగిస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా అత్యధిక ఫాలోవర్లు కలిగిన తొలి క్రికెటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ.. ఒక్కో పోస్ట్‌కు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అతను షేర్ చేసే ఒక వ్యాపార ప్రకటనతో పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్‌ఎల్)ను మూడు సార్లు నిర్వహించవచ్చు.
అంతేకాకుండా పాకిస్థాన్‌లోని ప్రధాన ఆటగాళ్ల వార్షిక వేతనాలను కూడా ఇవ్వవచ్చు. హూపర్ హెచ్‌క్యూ జాబితా వివరాల ప్రకారం విరాట్ కోహ్లీ ఒక్క ఇన్‌స్టా స్పాన్సర్ట్ పోస్ట్‌కు రూ.11.45 కోట్లు తీసుకుంటున్నాడు. పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ ప్రైజ్‌మనీ రూ. 3.40 కోట్లే కావడం విశేషం.

ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాలో అత్యధిక మొత్తం ఛార్జి చేసే తొలి 20 మంది పేర్లను హూపర్ హెచ్‌క్యూ విడుదల చేసింది. ఇందులో విరాట్ 14 స్థానంలో నిలిచాడు. అతనికి ఇన్‌స్టాలో 25.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా.. ఈ 20మంది జాబితాలో భారత్ నుంచి అతడొక్కడికే చోటు దక్కింది. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఈ జాబితాలో 29వ స్థానం నిలిచింది. ఆమె ఒక్క పోస్టుకు రూ. 4.4 కోట్లు వసూలు చేస్తోంది.
ఈ జాబితాపై హూపర్ హెచ్‌క్యూ సహ వ్యవస్థాపకుడు మైక్ బాండర్ మాట్లాడాడు.. సూపర్ స్టార్లు ఇన్‌స్టా నుంచి ఆర్జిస్తున్న సంపాదన చూస్తే ఆశ్చర్యమేస్తోందని తెలిపారు. వీరి సంపాదన ఏళ్లు గడిచేకొద్దీ పెరుగుతూనే ఉందని తెలిపాడు. 'ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్ వేదికగా సెలెబ్రిటీల సంపాదన ప్రతీ ఏడాది పెరుగుతూనే ఉంది.
కొత్త తరం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు వచ్చినా.. సెలబ్రెటీల ఆకర్షణ, గ్లామర్ ఏమాత్రం తగ్గడం లేదు. క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ మైదానంలోనే కాదు.. డిజిటల్ వేదికలపైనా సత్తా చాటుతున్నారు. ఇది సామాన్యూడిపై వారి ప్రభావాన్ని తెలియజేస్తోంది'అని చెప్పుకొచ్చాడు.
హూపర్ హెచ్‌క్యూ జాబితాలో ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో మెస్సీ ఉన్నాడు. 59.6 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న రొనాల్డో ఒక పోస్టుకు రూ.26.7 కోట్లు తీసుకొంటుండగా... 47.9 కోట్ల మంది ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉన్న లియోనల్ మెస్సీ రూ.21 కోట్లు వసూలు చేస్తున్నాడు.