
అహ్మదాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో సొంతగడ్డపై 5 వేల పరుగుల మైలు రాయి అందుకున్నాడు. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన రెండో వన్డేల్లో 8 పరుగులే చేసిన విరాట్.. 5 వేల పరుగుల మార్క్‌ను ధాటాడు.
తద్వారా ఈ రికార్డు నెలకొల్పిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందాడు.
ఈ జాబితాలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ 48.11 సగటుతో 6,976 పరగులు చేశాడు. ఆ తర్వాత స్థానాల్లో రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 5521 పరుగులు- 39.71 సగటు, కల్లీస్ (దక్షిణాఫ్రికా) 5186 పరుగులు- 45.89 సగటు ఉన్నారు. యావరేజ్ ప్రకారం (60.17)లో విరాట్ కోహ్లీనే అగ్రస్థానంలో ఉన్నాడు. సొంతగడ్డపై అత్యంత వేగంగా 5వేల పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.సొంతగడ్డపై విరాట్ కోహ్లీ 99 మ్యాచ్‌ల్లో 5002 పరుగులు చేశాడు. ఇందులో 19 శతకాలు, 25 అర్థశతకాలు ఉన్నాయి.
వెస్టిండీస్‌తో జరిగిన చారిత్రాత్మక 1000 వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 43.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. జాసన్ హోల్డర్ (71 బంతుల్లో 4 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాట్స్‌మెన్ అంతా దారుణంగా విఫలమయ్యారు. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్(4/49) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. వాషింగ్టన్ సుందర్(3/30) మూడు, ప్రసిధ్ కృష్ణ రెండు వికెట్లు తీశారు. వీరికి తోడుగా సిరాజ్ కూడా ఓ వికెట్ పడగొట్టాడు. భారత బౌలర్ల ధాటికి ఓ దశలో 79 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ విండీస్ 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ హోల్డర్ ఆ జట్టు పరువును కాపాడాడు.
అనంతరం టీమిండియా 28 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీకి తోడుగా.. ఇషాన్ కిషన్(28), సూర్యకుమార్ యాదవ్(34 నాటౌట్), దీపక్ హుడా(26 నాటౌట్) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు తీయగా.. అకీల హోస్సెన్‌కు ఓ వికెట్ దక్కింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(8), రిషభ్ పంత్(11) మరోసారి నిరాశపరిచారు.