ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీకి రంగం సిద్దమైంది. బుధవారం నుంచి ఈ టోర్నీకి తెరలేవనుంది. 15 ఏళ్ల సుదీర్ఘ సమయం తర్వాత భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ టోర్నీ బరిలోకి దిగుతున్నారు. న్యూఢిల్లీ తరఫున విరాట్ కోహ్లీ, ముంబై తరఫున రోహిత్ ఆడనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆయా జట్లతో కలిసి సన్నాహకాలు మొదలుపెట్టారు. ఈ ఇద్దరూ తమ జట్ల తరఫున తొలి రెండు మ్యాచ్‌లు ఆడనున్నారు.
కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు రిషభ్ పంత్ (ఢిల్లీ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్ (పంజాబ్), మహమ్మద్ షమీ (బెంగాల్), హార్దిక్ పాండ్యా (బరోడా) వంటి స్టార్ ఆటగాళ్లు కూడా తమ రాష్ట్ర జట్ల తరపున బరిలోకి దిగుతున్నారు.
అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ తెచ్చిన కొత్త నిబంధన కారణంగా భారత ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. దాంతో ఈ టోర్నీకి క్రేజ్ నెలకొంది. డిసెంబర్ 24 నుంచి జనవరి 18 వరకు ఈ టోర్నీ జరగనుంది. జనవరి 12 నుంచి నాకౌట్ మ్యాచ్‌లు జరగనుండగా.. జనవరి 18న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొత్తం 38 జట్లు బరిలోకి దిగుతున్నాయి.

బెంగళూరు వేదికగా ఆంధ్ర జట్టుతో ఢిల్లీ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆంధ్ర జట్టుకు ఆల్‌రౌండర్‌గా నితీష్ కుమార్ రెడ్డి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్‌కు ప్రేక్షకుల అనుమతి లేదు. ఐపీఎల్ 2025 సీజన్ విజయానంతరం చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కనీసం 2000 నుంచి 3000 మంది అభిమానులను అయినా లోపలికి అనుమతించాలని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో భద్రతా కారణాల రీత్యా అనుమతి నిరాకరించారు. ఈ మ్యాచ్ వేదికను కూడా చిన్నస్వామి నుంచి బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు తరలించారు.
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్‌తో పాటు జియో హాట్ స్టార్ వేదికగా ప్రసారం కానున్నాయి. లీగ్ దశలో అన్ని మ్యాచ్‌లకు ప్రత్యక్ష ప్రసారం లేదు. కేవలం అహ్మదాబాద్, రాజ్‌కోట్ వేదికగా జరిగే మ్యాచ్‌లు మాత్రమే ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. దాంతో కోహ్లీ, రోహిత్ మ్యాచ్‌లను చూసే అవకాశం అభిమానులకు లేకుండా పోయింది. 38 జట్లు ఉండటం.. ఒకే రోజు 19 మ్యాచ్‌లు ఒకే సమయంలో ప్రారంభం కానుండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. నాకౌట్ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.