భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్‌ను నిరవధికంగా వాయిదా పడింది. ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రత దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు. ఓవైపు దేశం యుద్ధం చేస్తుంటే.. మరోవైపు క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం సరికాదన్నారు. అయితే మళ్లీ ఈ టోర్నీని ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఐపీఎల్ నిరవధికంగా వాయిదా వేయడంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
ఐపీఎల్ వాయిదా అనంతరం భారత క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌కు పూర్తి మద్దతు తెలిపారు. ఐపీఎల్ గురించి ప్రస్తావించకున్నా.. భారత సైన్యానికి అండగా ఉన్నామని ట్వీట్ చేస్తున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భారత త్రివిధ దళాల పోరాటాన్ని కొనియాడాడు. జవాన్ల త్యాగాలకు తాము ఎప్పుడు రుణపడి ఉంటామని పేర్కొన్నాడు.

సెల్యూట్.. ఎప్పటికీ రుణపడి ఉంటాం..
'ఈ కష్ట సమయంలో మన దేశాన్ని కాపాడుతున్న భారత సాయుధ దళాలకు నేను సంఘీభావం తెలుపుతున్నా. వారి ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నా. మన గొప్ప దేశం కోసం మన జవాన్లు, వారి కుటుంబాలు చేసే త్యాగాలకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము'అని కోహ్లీ తన ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నాడు.
జస్‌ప్రీత్ బుమ్రా సైతం భారత సైనిక చర్యను సమర్థిస్తూ ట్వీట్ చేశాడు. 'మన సాయుధ దళాల ధైర్యానికి, శౌర్యానికి కృతజ్ఞతలు. వారికి నా సెల్యూట్. మమ్మల్ని సురక్షితంగా ఉంచేందుకు వారు చేసే ప్రతీదానికి రుణపడి ఉంటాం.'అని బుమ్రా ట్వీట్ చేశాడు. ఇతర క్రికెటర్లు, మాజీ ప్లేయర్లు కూడా భారత త్రివిధ దళాలకు సంఘీభావం ప్రకటిస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్..
జమ్మూ కశ్మీర్‌లో గత నెల 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు గత మంగళవారం ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో సుమారు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పహల్గాంలో భారత స్త్రీల సిందూరాన్ని నేల రాల్చిన వారి మీద ప్రతీకార చర్యగా 'ఆపరేషన్ సిందూర్'అని ఈ దాడికి నామకరణం చేశారు. అయితే ఈ ఆపరేషన్ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.