
సౌతాంప్టన్: కరోనా వైరస్ నేపథ్యంలో కఠిన ఆంక్షలతో సావాసం చేస్తూ వరుస బయో బబుల్స్‌తో విసిగిపోతున్న భారత ఆటగాళ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బంపరాఫర్ ఇవ్వనుంది. ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ అనంతరం ఆటగాళ్లకు 20 రోజుల పాటు రిలాక్స్ అయ్యే వెసులుబాటును కల్పించనున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు జూన్ 18-22 మధ్య న్యూజిలాండ్‌తో జరగబోయే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం సౌథాంప్టన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బయోబుడగలో సాధన చేస్తోంది.
ఈ ఫైనల్ పూర్తవ్వగానే అక్కడే ఉండి ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14వరకు ఆతిథ్య ఇంగ్లండ్‌తో 5 టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు మధ్య దాదాపు 40రోజుల పాటు ఆటగాళ్లకు విరామ సమయం దొరుకుతుంది. కాబట్టి ప్లేయర్స్ మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బుడగ నుంచి బయటకు వచ్చి వారు సరదాగా గడిపేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఇందుకోసం జూన్ 24 నుంచి జులై 14వరకు 20రోజుల పాటు వారికి బ్రేక్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి మీడికయాకు తెలిపారు.
'న్యూజిలాండ్‌తో ఫైనల్ అవ్వగానే జున్ 24నుంచి ఆటగాళ్లకు బుడగ జీవితం నుంచి విరామం ఇవ్వనున్నాం. మళ్లీ ఇంగ్లండ్ సిరీస్ కోసం జులై 14న వారు తిరిగి బబుల్‌లోకి అడుగుపెడతారు. ప్లేయర్స్‌కు మానసిక విశ్రాంతి అవసరం. యూకే దాటి బయటకు వెళ్లడం కష్టం. అకస్మాత్తుగా కేసులు పెరిగి ప్రయాణ ఆంక్షలు విధిస్తే మళ్లీ తిరిగి రాలేము. కాబట్టి ఈ విరామ సమయాన్ని సరదాగా గడిపేందుకు యూకేలోని ప్రాంతాలను మాత్రమే పరిశీలిస్తున్నాం.'అని సదరు అధికారి పేర్కొన్నారు.
కాగా, జూన్ 2న ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరేముందు ముంబైలో రెండు వారాలు క్వారంటైన్‌లో గడిపిన టీమిండియా సభ్యులు, ఇంగ్లండ్‌లో దిగిన తర్వాత మళ్లీ మూడు రోజులు క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ సమయంలో వారు ఒకరినొకరు కలుసుకునే అవకాశం కూడా లభించలేదు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాత బయో బబుల్ నుంచి 20 రోజుల బ్రేక్ లభించడమనేది టీమిండియాకు ఊరట కలిగించే అంశమే.
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే ఐదు టెస్ట్‌ల సిరీస్ ముగిసాక, టీమిండియా క్రికెటర్లంతా మళ్లీ ఐపీఎల్ బబుల్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ 20 రోజులు వాళ్లకు స్వేచ్ఛగా తిరిగే అవకాశం రావడం మానసికంగా ఉల్లాసానికి గురి చేసే విషయమేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ అంశంపై మాట్లాడాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత బయోబబుల్ నుంచి ఆటగాళ్లకు కాస్త విరామం ఉంటే బాగుంటుందన్నాడు.