పుట్టకతోనే అరుదైన వ్యాధి..
హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన ఓ సాప్ట్ వేర్ దంపతులకు మూడేళ్ల క్రితం అయాన్ష్ గుప్తా జన్మించాడు. శారీరక, మానసిక ఎదుగుదల లోపంతో బాధపడుతుండటంతో చికిత్స కోసం తల్లిదండ్రులు సికింద్రాబాద్ రెయిన్ బో అస్పత్రికి చెందిన పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకికి చూపించారు.
సదరు వైద్యుడు బాలుడికి పలు రకాల పరీక్షలు నిర్వహించి.. అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఈ వ్యాధికి చికిత్స కూడా చాలా ఖరీదుతో కూడినది కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వైద్యుల సలహా మేరకు ఆన్‌లైన్ వేదికగా విరాళాలు సేకరించే ఇపాంక్ట్ గురు స్వచ్చంద సంస్థను ఆశ్రయించారు.

రూ. 22 కోట్ల ఇంజెక్షన్..
సాధారణంగా ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు చికిత్సల్లో భాగంగా రూ.22 కోట్ల విలువ చేసే 'జొలెస్మా' ఇంజెక్షన్ వాడాల్సి ఉంటుంది. ఇది అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. అయితే కేంద్రం రూ.6 కోట్లు దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. వైద్యుల సూచన మేరకు క్రౌడ్ ఫండింగ్ చేపట్టి రూ.16 కోట్లు సేకరించారు. ఖరీదైన మందును బాలుడికి ఇచ్చిన అతని ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరిచారు. ప్రస్తుతం బాలుడు కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

విరుష్క సాయానికి..
ఈ క్రౌడ్ ఫండింగ్‌లో తమ వంతు సాయం ప్రకటించిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు బాలుడి తల్లిదండ్రులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు గత నెల 24నే ట్వీట్ చేశారు. 'విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. మీ అభిమానులుగా మేం ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తాం. కానీ మీరు అయాన్ష్ కోసం మేం ఊహించనిదాని కంటే ఎక్కువ చేశారు.
మీ ఔదార్యానికి ధన్యవాదాలు. మా జీవితంలోనే ఈ కఠినమైన మ్యాచ్‌ను సిక్స్‌తో గెలవడానికి మీరు సాయం చేశారు. మీ సాయానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.'అని పేర్కొన్నారు. అయితే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఎంత సాయం చేశారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కానీ భారీ మొత్తంలోనే సాయం చేసినట్లు చిన్నారి తల్లిదండ్రుల ట్వీట్‌ను బట్టి తెలుస్తోంది.

ఇంగ్లండ్‌లో కోహ్లీ..
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సతీసమేతంగా యూకేకు వెళ్లాడు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. అయితే ప్రాక్టీస్ సెషన్‌లో విరాట్ కోహ్లీ గాయపడ్డాడని, మహ్మద్ షమీ వేసిన బంతి అతని పక్కటెముకలకు బలంగా తాకిందని, నాలుగు వారాల విశ్రాంతి అవసరమనే వార్తలు వినిపించాయి. కానీ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో కోహ్లీ బరిలోకి దిగడం, బౌలింగ్ చేయడం చూస్తే అవన్నీ గాలి వార్తలేనని స్పష్టమైంది. జూన్ 18 నుంచి 22 వరకు ఈ మెగా ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications
