
ముంబై: కరోనా వైరస్ కట్టడిలో పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి పోరాడుతున్నారు. లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేస్తూ ప్రజలను కొవిడ్-19 మహమ్మారి నుంచి రక్షిస్తున్నారు. ఈ పోరాటంలో కొందరూ పోలీసులు ఈ ప్రాణాంతక వైరస్ భారిన కూడా పడుతున్నారు. దేశంలోనే ఈ మహమ్మారి ఉదృతి మరీ ఎక్కువగా ఉన్న ముంబైలో సుమారు 714 మంది పోలీసులు ఈ వైరస్ భారిన పడ్డారు.
ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. వీరి సంక్షేమం కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మలు ముందుకొచ్చారు. చెరో రూ.5 లక్షల చొప్పున రూ.10 లక్షల రూపాయాలను ముంబై పోలీస్ సంక్షేమానికి విరాళంగా ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. ఈ విషయాన్ని ముంబై పోలీస్ ట్విటర్ వేదికగా తెలియజేస్తూ.. విరుష్కా జోడీకి కృతజ్ఞతలు తెలిపింది. సీపీ ముంబై పోలీస్ పేరిట ఉన్న ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని పేర్కొంది.
'ముంబై పోలీస్ సంక్షేమానికి చెరో రూ.5లక్షల చొప్పున విరాళం ప్రకటించిన విరాట్ కోహ్లీ, అనుష్కశర్మలకు ధన్యవాదాలు. మీ ఈ సహకారం కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ముందుండి పోరాడుతున్న వారిని కాపాడుతుంది. 'అని ట్వీట్ చేశారు.
ఇప్పటికే కరోనా కట్టడికి తమవంతుగా పీఎం కేర్స్‌కు విరాళాన్ని ప్రకటించిన విరుష్కా జోడీ.. ఎంత సాయం చేశారనే విషయం మాత్రం ప్రకటించలేదు. అయితే మహారాష్ట్ర సీఎం నిధికి, పీఎంకేర్స్‌కు కలిపి రూ.3 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారని వారి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక క్వారంటైన్ సమయంలో లాక్‌డౌన్ నిబంధనలపై ఎప్పటికప్పుడు విరుష్కా జోడీ సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పించింది. గృహ హింస చేయరాదని కూడా సూచించింది.