
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి అయ్యాడు. అతని సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ సోమవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీనే ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. ఈ సంతోషకరమైన వార్తను పంచుకోవడానికి చాలా థ్రిల్‌గా ఫీలవుతున్నామని ట్వీట్ చేశాడు.
'ఈ మధ్యాహ్నం మాకు కూతురు పుట్టింది. ఈ సంతోషకరమైన వార్తను మీతో పంచుకోవడానికి చాలా థ్రిల్‌గా ఫీలవుతున్నాం. మాపై చూపిన మీ ప్రేమాభిమానాలకు, మా క్షేమం కోసం ప్రార్థించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. అనుష్క శర్మ, బేబీ ఆరోగ్యంగా ఉన్నారు. ఇక నుంచి మా జీవితాల్లో మేం ఓ కొత్త చాప్టర్‌ను ప్రారంభించబోతున్నాం. ఈ సమయంలో మా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నా'అని విరాట్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని హిందీ, ఇంగ్లీషు రెండు భాషల్లో పంచుకున్నాడు. తల్లిదండ్రులైన విరుష్క జోడీకి అభిమానులు, క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు.
ఇక ప్రసవ సమయంలో అనుష్క శర్మ పక్కనే ఉండేందుకు, తొలి బిడ్డ క్షణాలను ఆస్వాదించేందుకు విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో కోహ్లీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వగా.. మెజార్టీ సభ్యులు విరాట్‌కు అండగా నిలిచారు. ఇక ఆగస్టులో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించిన విరాట్.. 'జనవరిలో మేం ముగ్గురం కాబోతున్నాం'అని ట్వీట్ చేశాడు.
ఆ తర్వాత అనుష్క శర్మ కూడా తన హెల్త్ అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంది. కొన్నేళ్ల ప్రేమాయణం తర్వాత 2017లో ఇటలీ వేదికగా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.