ఐసీసీ ప్రతిష్టాత్మక క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ రేసులో ముగ్గురు భారత ఆటగాళ్లు నిలిచారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ, యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురితో పాటు న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఈ అవార్డుకు నామినేట్ అయ్యాడు.
ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌కు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను గురువారం వెల్లడించారు. గతేడాది వన్డే ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఈ అవార్డుకు నామినేట్ చేశారు. అభిమానుల ఓటింగ్ ద్వారా ఈ అవార్డ్ విన్నర్‌ను ప్రకటించనున్నారు.

శుభ్‌మన్ గిల్..
గతేడాది శుభ్‌మన్ గిల్ 29 వన్డేలు ఆడి 63.36 సగటుతో 1584 పరుగులు చేయడంతో పాటు 24 క్యాచ్‌లు పట్టాడు. భారత్ వేదికగానే జరిగిన వన్డే ప్రపంచకప్‌లో 44.25 సగటుతో 354 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
మహమ్మద్ షమీ..
గతేడాది 19 వన్డేలు ఆడిన మహమ్మద్ షమీ 43 వికెట్లు తీయడంతో పాటు 3 క్యాచ్‌లు పట్టాడు. బ్యాటింగ్‌లో 36 పరుగులు చేశాడు. గతేడాది ఫస్టాఫ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపని షమీ.. సెకండాఫ్‌లో మాత్రం దుమ్మురేపాడు. ముఖ్యంగా ప్రపంచకప్‌లో నిప్పులు చెరిగాడు. రికార్డుల మోత మోగించాడు. ఆరంభ మ్యాచ్‌లకు దూరమై.. అనూహ్య పరిస్థితుల్లో తుది జట్టులోకి వచ్చిన షమీ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
10.7 సగటుతో 24 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అంతేకాకుండా వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న బౌలర్‌గా చరిత్రకెక్కాడు. అలాగే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గానూ షమీ రికార్డ్ అందుకున్నాడు. 18 మ్యాచ్‌ల్లో షమీ 55 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో షమీ (7/57) ఏడు వికెట్లతో సత్తా చాటాడు.
విరాట్ కోహ్లీ..
గతేడాది విరాట్ కోహ్లీ దుమ్మురేపాడు. పాత కోహ్లీని తలపిస్తూ మైదానంలో పరుగుల వరద పారించాడు. 27 వన్డేల్లో 1377 పరుగులు చేయడంతో పాటు 12 క్యాచ్‌లు అందుకున్నాడు. బౌలింగ్‌లో ఓ వికెట్ కూడా తీసాడు. ప్రపంచకప్‌లో 11 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన కోహ్లీ 765 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డ్ అందుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా వరల్డ్ రికార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు.
డారిల్ మిచెల్..
న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ 26 మ్యాచ్‌ల్లో 1204 పరుగులు చేశాడు. 22 క్యాచ్‌లతో పాటు బౌలింగ్‌లో 9 వికెట్లు తీసాడు. వన్డే ప్రపంచకప్‌లోనూ డారిల్ మిచెల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 69 యావరేజ్‌తో 552 పరుగులు చేశాడు. ఇక ఐసీసీ వన్డే ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కోహ్లీ లేదా షమీ అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.