ఆ దేవుడి దయ వల్ల తాను ఆరోగ్యంగానే ఉన్నానని టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ అన్నాడు. ఇటీవల వినోద్ కాంబ్లీకి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో 52 ఏళ్ల వినోద్ కాంబ్లీ నడవలేని స్థితిలో ఉండటం చూసి క్రికెట్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
ఈ క్రమంలోనే తన ఆరోగ్య పరిస్థితిపై వినోద్ కాంబ్లీ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. బాగానే ఉన్నాననే ఫొటోను పంచుకున్నాడు. 'దేవుడి దయవల్ల బాగున్నాను. మైదానానికి వెళ్లి బ్యాటింగ్ చేసేంత ఫిట్‌గా ఉన్నాను'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. క్రికెట్ గాడ్, భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు చిన్ననాటి స్నేహితుడైన వినోద్ కాంబ్లీ.. భారత్ తరఫున 100కు పైగా వన్డేలు, 17 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.

90వ దశకంలో వినోద్ కాంబ్లీ ఓ వెలుగు వెలిగాడు. స్కూల్ క్రికెట్‌లో సచిన్‌తో కలిసి 664 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ను నెలకొల్పాడు. ఎడమ చేతివాటం బ్యాటర్ అయిన వినోద్ కాంబ్లీ తొమ్మిదేళ్ల పాటు నిలకడగా బ్యాటింగ్ చేశాడు.
దేశవాళీ క్రికెట్‌లో పదివేల పరుగులు చేశాడు. ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దాంతో అతని కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడింది. మరోవైపు సచిన్ మాత్రం వరల్డ్ బెస్ట్ బ్యాటర్‌గా ఎదిగాడు. 100 శతకాలతో పాటు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డ్ సాధించాడు. వినోద్ కాంబ్లీ మాత్రం అనవసర వివాదాలతో వార్తల్లో నిలిచేవాడు. తాగుడుకు బానిసైన అతను.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం ఉన్నా ఆయన సర్వీసులను ఏ రకంగానైనా వినియోగించుకోవడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. 2013లో వినోద్ కాంబ్లి తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు.