Vikram Rathour: కరోనా కలకలంతో కలత చెందాం.. అయినా కుర్రాళ్లు దుమ్ములేపారు!

లండన్: భారత జట్టులో కరోనా కలకలం రేగడంతో కలత చెందామని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. అయినా కుర్రాళ్లు ఏకాగ్రతతో ఆడి దుమ్మురేపారని మెచ్చుకున్నాడు. ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి వైరస్ బారిన పడినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఓ ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. ముందస్తు చర్యల్లో భాగంగా రవిశాస్త్రికి సన్నిహితంగా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫిజియో నితిన్ పటేల్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్‌లను హోటల్ గదుల్లోనే ఐసోలేషన్‌కు తరలించారు.
మెడికల్ టీమ్ క్లియరెన్స్ ఇచ్చేవరకు వారు ఐసోలేషన్‌లోనే ఉంటారని బీసీసీఐ పేర్కొంది. జట్టులోని ఇతర సిబ్బంది, ఆటగాళ్లందరికీ రెండు సార్లు పరీక్షలు నిర్వహించామని అందరికి నెగటీవ్ రావడంతోనే నాలుగో రోజు ఆటకు అనుమతిచ్చామని స్పష్టం చేసింది. తాత్కలిక హెడ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్ అదనపు బాధ్యతలు నిర్వర్తిసాడని పేర్కొంది.

కలత చెందారు..
ఇక నాలుగో రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన విక్రమ్ రాథోడ్.. శనివారం సాయంత్రం నుంచే రవి శాస్త్రి అసౌకర్యంగా కనిపించారని వెల్లడించాడు. 'మేం హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫిజియో నితిన్ పటేల్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ సేవలను మిస్సయ్యాం. వీరంతా ఈ జట్టుకు అత్యంత కీలకం.
ఐదారేళ్లుగా వారు జట్టు ప్రదర్శనలో కీలకంగా ఉన్నారు. కానీ జరిగిన దాన్ని మనం అడ్డుకోలేం. ఏదేమైనా వారు ఈ కీలక సమయంలో అందుబాటులో లేకుండా పోయారు. అందుకే ఆదివారం ఉదయం ఆటగాళ్లు కాస్త కలత చెందారు. మా చేతుల్లో ఏం లేదని భావించాం. ఏకాగ్రతతో క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాం.

ఆటగాళ్లు అదరగొట్టారు..
'మేం ఈ సిరీసు ఆడేందుకు ఇక్కడకు వచ్చాం. మాకు ఈ సిరీసు ఎంతో కీలకం. మ్యాచ్‌పై పట్టు సాధించాలంటే నాలుగో రోజు అత్యంత కీలకమని మాకు తెలుసు. అందుకే క్రికెట్‌పై దృష్టిసారించాం. కుర్రాళ్లు సైతం అదరగొట్టారు. శనివారం రాత్రి జరిగిన పరిణామాలతో ఆటగాళ్లు కలతపడతారని తెలుసు. దానిని అధిగమించి రాణించినందుకు వారికి అభినందనలు. కచ్చితంగా సమయమెంతో చెప్పలేను.
రాత్రి 8 గంటలకు అనుకుంటా. శాస్త్రి కొద్దిగా నలతగా కనిపించాడు. దాంతో వైద్యబృందం మళ్లీ టెస్టు చేసింది. అందులో పాజిటివ్ వచ్చింది. ఆ విషయం తెలియగానే సన్నిహితంగా మెలిగిన వారిని ఐసోలేషన్‌కు పంపించారు. మళ్లీ వారెప్పుడు జట్టుతో కలుస్తారో వైద్య బృందం చెప్తుంది' అని రాథోడ్ చెప్పుకొచ్చాడు.

విజయానికి 10 వికెట్లు..
ఆఖరి రోజు మొత్తం 10 వికెట్లు పడగొడితేనే భారత్‌కు విజయం దక్కుతుంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు కూడా విజయంపై కన్నేసింది. 368 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్ (31 బ్యాటింగ్), హసీబ్ (43 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 148.2 ఓవర్లలో 466 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్‌కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శార్దుల్ ఠాకూర్ (72 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 60) వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడగా... వికెట్ కీపర్ రిషభ్ పంత్ (106 బంతుల్లో 4 ఫోర్లతో 50) రాణించాడు. క్రిస్ వోక్స్ 3 వికెట్లు తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications