కొలంబో: ఆసియాకప్ 2023 సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత బ్యాటర్లు సత్తా చాటుతారని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ తెలిపాడు. వరల్డ్ బెస్ట్ పాకిస్థాన్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారని ధీమా వ్యక్తం చేశాడు. ఆసియా కప్ లీగ్ దశలో వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్‌లో పాకిస్థాన్ పేస్ త్రయం ధాటికి భారత టాపార్డర్ 64 పరుగులకే కుప్పకూలింది.
ఈ మ్యాచ్‌లో అన్ని వికెట్లు పేసర్లే పడగొట్టగా. షాహిన్ అఫ్రిది నాలుగు, హారిస్ రౌఫ్, నసీమ్ షా మూడేసి వికెట్లు తీశారు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలను షాహిన్ అఫ్రిది ఔట్ చేశాడు. ఈ రెండు జట్లు మరోసారి సూపర్-4లో తలపడనున్న నేపథ్యంలో విక్రమ్ రాథోడ్ స్పందించాడు.

పాకిస్థాన్‌కు అత్యుత్తమ బౌలింగ్ యూనిట్ ఉందని కొనియాడిన విక్రమ్ రాథోడ్.. భారత ఆటగాళ్లకు వారిని ఎదుర్కొనే సత్తా ఉందని చెప్పాడు. 'సూపర్-4 మ్యాచ్‌లో మా ఆటగాళ్లు మెరుగ్గా బ్యాటింగ్ చేస్తారు. గత మ్యాచ్‌లో పరిస్థితులు భిన్నంగా ఉండటంతో పాక్ పేసర్లు చెలరేగారు. ప్రస్తుతం పాకిస్థాన్‌కు మంచి బౌలింగ్ అటాక్ ఉంది.
ఆ జట్టు పేసర్లను సమర్థంగా ఎదుర్కొనే సత్తా భారత బ్యాటర్లకు ఉంది. అయితే కొన్నిసార్లు పరిస్థితులు వారికి అనుకూలంగా ఉండి మెరుగైన ప్రదర్శన చేస్తారు. మంచి ఆరంభం లభిస్తే మా బ్యాటర్లు కూడా పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుతారు'అని విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ టాపార్డర్ విఫలమైనా..యువ ప్లేయర్ ఇషాన్‌కిషన్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇషాన్ కిషన్‌పై విక్రమ్ రాథోడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. 'మిడిల్ ఆర్డర్‌లో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ రూపంలో ఇద్దరు మంచి ఆటగాళ్లు ఉండటం జట్టుకు లాభం చేకూరుస్తుంది.'అని విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్‌పై ఇషాన్ (81 బంతుల్లో 82) అసాధారణ బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆసియా కప్ సూపర్-4లో భాగంగా సెప్టెంబర్ 10న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ తలపడనున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే 17న జరిగే ఫైనల్‌లోనూ దాయాదులు మరోసారి తలపడవచ్చు.