Vikram Rathour: కోహ్లీ పత్యేకత అదే.. ఏ జట్టులో 11 మంది పుజారాలు.. పంత్‌లు.. ఉండరు కదా!

ముంబై: ఏ జట్టులోనూ 11 మంది పుజారాలు.. 11 మంది పంత్‌లు ఉండరని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. ఆట పరంగా వారి మనస్తత్వాలు వేరుగా ఉంటాయని తెలిపాడు. ఆటగాడిని బట్టి శిక్షణ ఉంటుందన్నాడు. మ్యాచ్‌లో ఎప్పుడెలా ఆడాలో విరాట్ కోహ్లీని మించి ఎవరికీ తెలియదన్నాడు. పరిస్థితులను ఆకలింపు చేసుకోవడంలో అతనికెవరూ సాటిలేరని చెప్పుకొచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్యాట్స్‌మెన్‌లో ఒక్కోక్కరు ఒక్కదాంట్లో స్పెషలిస్ట్ అయితే.. విరాట్ దగ్గర అన్ని ఉంటాయని చెప్పాడు. అదే అతన్ని వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ చేసిందన్నాడు. ఇక రోహిత్ తన బ్యాటింగ్‌లో నియంత్రణ సాధించాడని వెల్లడించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ నేపథ్యంలో టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ప్రతీ ఒక్కరితో..
'జట్టులో చర్చలు ఎప్పుడూ జరుగుతుంటాయి. అవే జట్టు దృక్పథాన్ని మెరుగుపరుస్తాయి. అందుకు భిన్నంగా నేను ఒక్కొక్కరితోనూ ప్రత్యేకంగా మాట్లాడతాను. ఉదాహరణకు పుజారా, పంత్ భిన్నమైన మనస్తత్వాలు, పని విలువలు కలిగిన వారు. వారు చెప్పేది జాగ్రత్తగా వింటేనే వారి గురించి బాగా అర్థమవుతుంది. వారు ఎలాంటి పరిష్కారాలు కోరుకుంటున్నారో తెలుస్తుంది. ఎక్కువ ప్రతిభ, వైవిధ్యం గలవారితో విడివిడిగా మాట్లాడటం అవసరం. పుజారాకు అంకితభావం ఎక్కువ. పట్టుదలగా, క్రమశిక్షణతో ఉంటాడు. క్రికెట్లోనే కాదు అతడి జీవనశైలీ ఇలాగే ఉంటుంది. ఒకే తరహా పద్ధతులు ఉంటాయి.

ఇద్దరూ ఉండాల్సిందే..
ఇక పంత్ నిర్భయంగా చాలా సరదాగా ఉంటాడు. తన శైలిలో ఆడేందుకు ఇష్టపడతాడు. మరి ఏ జట్టులోనూ 11 మంది పుజారాలు, 11 మంది పంత్‌లు ఉండరు కదా.? పంత్, పుజారా గెలుపు కూర్పులో ఉండాల్సిందే. అందుకే వారిని వారి శైలిలోనే ఉండనివ్వడం ముఖ్యం. నా వరకు పుజారా అదనంగా తన అమ్ముల పొదిలో కొత్త షాట్లు సంపాదించుకోవడం, పంత్ అవసరమైతే ఎక్కువ బంతులు డిఫెండ్ చేయగలిగేలా చేయడమే ముఖ్యం' అని రాథోడ్ తెలిపాడు.

విరాట్ స్పెషల్ అదే..
కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యంత పరిణతి కలిగిన ఆటగాడని బ్యాటింగ్ కోచ్ ప్రశంసించాడు. 'విరాట్ ఏంటో అతని రికార్డులే చెబుతాయి. అతని నిలకడైన ప్రదర్శనలు, సత్తా మనం చూసిందే. అయితే నా అభిప్రాయం ప్రకారం అతనిలో ఉన్న అత్యున్నతమైన లక్షణం ఏందంటే పరిస్థితులను అందిపుచ్చుకోవడం. పరిస్థితుకు తగ్గట్లు ఆడగలడు.. మ్యాచ్‌ను తనవైపు తిప్పుకోగలడు. ఈ తరంలో చాలా మంది ఆటగాళ్లున్నారు. ఒక్కొకరు ఒక్కోదాంట్లో స్పెషల్. కొందరూ ఒత్తిడిని బాగా అధిగమిస్తే.. మరికొందరూ డిఫెన్ బాగా ఆడుతారు. ఇంకొందరూ ధాటిగా ఆడుతారు. కానీ విరాట్‌లో ఇవన్నీ చూడవచ్చు. అదే అతని అతిపెద్ద బలం. విరాట్ ఒక కంప్లీట్ ప్యాకెజ్.

ఒక్క సిక్స్ కొట్టకుండా..
2016 ఐపీఎల్‌లో నాలుగు సెంచరీలు, భారీ సిక్సర్లు బాదిన అతను వెస్టిండీస్‌లో గాల్లోకి కొట్టకుండానే ద్విశతకం చేశాడు. ఇక్కడ సిక్స్ కొట్టాలనుకుంటే కోహ్లీ కొట్టలేడా? కానీ మ్యాచ్ పరిస్థితులు డిమాండ్ చేయలేదు కాబట్టి నిదానంగా ఆడాడు. ఈ తరహా బ్యాటింగ్‌ను నేను మరే బ్యాట్స్‌మెన్‌లో చూడలేదు. అందుకే విరాట్ ప్రత్యేకం. టెస్టుల్లోనూ రాణిస్తున రోహిత్‌శర్మ తన ఆలోచనలు, బ్యాటింగ్‌పై నియంత్రణ సాధించాడని పేర్కొన్నారు. అజింక్య రహానె గొప్ప ఆటగాడని జట్టు విజయం కోసమే కృషి చేస్తాడని వెల్లడించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications