ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ మరో విజయం సాధించింది. శుక్రవారం బెంగళూరులోని బీసీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్‌ను ఓడించింది. టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ(61 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 77), రిషభ్ పంత్(79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీలతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 254 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో విశాల్ జైస్వాల్(4/42) నాలుగు వికెట్లతో రాణించాడు. అనంతరం గుజరాత్ 47.4 ఓవర్లలో 247 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఆర్య దేశాయ్(57), సౌరవ్ చౌహన్(49) రాణించినా ఫలితం లేకపోయింది.
తనదైన శైలిలో ఆన్‌డ్రైవ్‌లు, కట్‌షాట్లతో స్కోరు పెంచినా కోహ్లీ..సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ విశాల్ జైస్వాల్ అద్భుతమైన బంతితో కోహ్లీని స్టంపౌట్ చేశాడు. రిషభ్ పంత్ సెంచరీని కూడా అతనే అడ్డుకున్నాడు. సోమవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో సౌరాష్ట్రతో ఢిల్లీ తలపడనుంది.

భారీ శతకంతో విజయ్ హజారే ట్రోఫీని ప్రారంభించిన రోహిత్.. రెండో మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపర్చాడు. ఉత్తరఖాండ్‌తో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 331 పరుగులు చేసింది. ఓపెనర్లు రఘువంశీ(11), రోహిత్ శర్మ(0) తీవ్రంగా నిరాశపర్చినప్పటికీ.. ముషీర్ ఖాన్(55), సర్ఫరాజ్ ఖాన్(55), హార్దిక్ తోమర్(93) హాఫ్ సెంచరీలతో రాణించారు. షమ్సీ ములానీ(48) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఉత్తరఖాండ్ బౌలర్లలో దేవంద్ర సింగ్ బోరా మూడు వికెట్లు తీయగా.. నాగర్‌కోటి, మయాంక్ మిశ్రా, సుచిత్, యువరాజ్ చౌదరి తలో వికెట్ తీసారు.
అనంతరం ఉత్తరఖాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 280 పరుగులే చేసి ఓటమిపాలైంది. యువరాజ్ చౌదరి(96) సెంచరీ చేజార్చుకోగా.. జగదీష సుచిత్(51) హాఫ్ సెంచరీతో రాణించాడు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, తుక్రమ్ తార్మలే, ముషీర్ ఖాన్ రెండేసి వికెట్లు తీసారు.
టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ మళ్లీ ఫామ్ అందుకున్నాడు. కేరళతో జరిగిన మ్యాచ్‌లో కరుణ్ నాయర్(130 బంతుల్లో 14 ఫోర్లతో 130 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. అతనికి తోడుగా దేవదత్ పడిక్కల్(137 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 124) సెంచరీతో సత్తా చాటడంతో కర్ణాటక 8 వికెట్ల తేడాతో కేరళపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కేరళ 284/7 స్కోర్ చేయగా.. కర్ణాటక 48.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
రింకు సింగ్(60 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 106) భారీ శతకంతో ఉత్తరప్రదేశ్ 227 పరుగుల తేడా చండీగఢ్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో యూపీ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 367 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్(67) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం చండీగఢ్ 29.3 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటైంది. జీషన్ అన్సారీ(4/29) నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.