ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తెలుగు జట్లు హైదరాబాద్, ఆంధ్ర తీవ్రంగా నిరాశపర్చాయి. హైదరాబాద్ వరుసగా నాలుగు మ్యాచ్‌లకు నాలుగు ఓడగా.. ఆంధ్ర నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచే గెలిచింది. ఇరు జట్లు ఇంకా మూడేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మూడుకు మూడు మ్యాచ్‌లు గెలిచినా ఆంధ్ర, హైదరాబాద్ క్వార్టర్స్ చేరే అవకాశాలు లేవు. ఇది తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది.
విజయ్ హజారే ట్రోఫీలో మొత్తం 38 జట్లు పోటీపడుతున్నాయి. ఇందులో 32 జట్లు ఎలైట్ గ్రూప్‌లో ఆడనుండగా.. మరో 6 జట్లు ప్లేట్ గ్రూప్‌లో బరిలోకి దిగుతున్నాయి. ఎలైట్ గ్రూప్‌లోని 32 జట్లను ఏ,బీ, సీ, డీ నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో 8 జట్లు ఉంటాయి.
లీగ్ స్టేజ్‌లో రౌండ్ రాబిన్ పద్దతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతీ గ్రూపులోని జట్టు తమ ప్రత్యర్థి జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతోంది. అంటే ఒక్కో జట్టు ఏడేసి మ్యాచ్‌లు ఆడుతోంది. గెలిచిన జట్టుకు 4 పాయింట్లు.. మ్యాచ్ రద్దైనా లేదా ఫలితం తేలకపోయినా చెరో 2 పాయింట్లు లభిస్తాయి. నాలుగు ఎలైట్ గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఈ 8 జట్ల నుంచి 4 జట్లు సెమీఫైనల్స్ ఆడుతాయి. సెమీఫైనల్లో గెలిచిన జట్లు ఫైనల్లో తలపడుతాయి.

ప్లేట్ గ్రూప్‌లోని 6 జట్లు తమ ప్రత్యర్థితో ఒక్కో మ్యాచ్ ఆడుతాయి. అంటే ఒక్కోటీమ్ ఐదు లీగ్ మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ ఐదు మ్యాచ్‌లు ముగిసే సమయానికి టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఫైనల్లో గెలిచిన జట్టు తదుపరి సీజన్‌లో ఎలైట్ గ్రూప్‌కు అర్హత సాధిస్తోంది. అదేవిధంగా.. నాలుగు ఎలైట్ గ్రూపుల్లో కలిపి అత్యంత తక్కువ పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్ ఉన్న జట్టు ప్లేట్ గ్రూప్‌కు డీమోట్ అవుతుంది.
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో హైదరాబాద్ జట్టు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎలైట్ గ్రూప్-బీలో ఉన్న హైదరాబాద్ వరుసగా నాలుగు మ్యాచ్‌లకు నాలుగు ఓడి ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టుకు ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ మూడు మ్యాచ్‌లకు మూడు ఆడినా క్వార్టర్స్ చేరే అవకాశాలు లేవు.
గ్రూప్-బీలో ఉత్తరప్రదేశ్ ఇప్పటికే 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్, విదర్భ, బరోడా, బెంగాల్ వంటి జట్లు ఒక్కొక్కటి 12 పాయింట్లతో పోటీలో ఉన్నాయి. హైదరాబాద్ చివరి 3 మ్యాచ్‌ల గెలిచినా 12 పాయింట్స్ మాత్రమే వస్తాయి. కాబట్టి ఈ గ్రూప్‌లో టాప్-2లో నిలవడం అసాధ్యం.
ఎలైట్ గ్రూప్-డీలో ఉన్న ఆంధ్ర ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి ఒక్క విజయం మాత్రమే నమోదు చేసింది. 4 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతోంది. ఈ గ్రూప్‌లో ఇప్పటికే ఒడిశా, రైల్వేస్, హర్యానా, ఢిల్లీ 12 పాయింట్లతో టాప్-4లో ఉండగా.. సౌరాష్ట్ర 8 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఆంధ్ర తమ చివరి మ్యాచ్‌లు గెలిచినా 14 పాయింట్లతోనే నిలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో టాప్-5 జట్లలో నాలుగు టీమ్స్ తమ చివరి మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వాలి. అంతేకాకుండా ఆంధ్ర రన్ రేట్ మెరుగ్గా ఉండాలి. కానీ ఆంధ్ర రన్‌రేట్ మైనస్‌లో ఉంది. కాబట్టి ఆంధ్ర కూడా క్వార్టర్స్ చేరడం అసాధ్యం.