ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో బ్యాటర్లు దుమ్మురేపారు. బంతి మీద పగబట్టినట్లు.. బౌలర్లతో ఆజన్మ విరోధం ఉన్నట్లు.. సింగిల్స్ తీయడమే తెలియదన్నట్లు విధ్వంసం సృష్టించారు. దాంతో ఈ టోర్నీలో తొలి రోజే పరుగుల వరద పారింది. 38 జట్ల మధ్య బుధవారం ప్రారంభమైన ఈ టోర్నీలో ఒక్క రోజే రికార్డ్ స్థాయిలో 22 శతకాలు నమోదయ్యాయి.
సుదీర్ఘ విరామం అనంతరం దేశవాళీ వన్డేలు ఆడిన స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ శతకాలతో చెలరేగితే.. బిహార్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తృటిలో ద్విశతకాన్ని చేజార్చుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన జార్ఖండ్ డైనమైట్ ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీతో కదంతొక్కితే.. అదే మ్యాచ్‌లో కర్ణాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్ భారీ శతకంతో చెలరేగాడు.
ఒడిశా ప్లేయర్ స్వస్తిక్ సమల్ ఈ టోర్నీ చరిత్రలోనే 8వ డబుల్ సెంచరీ నమోదు చేసిన ప్లేయర్‌గా రికార్డ్ సాధిస్తే.. 32 బంతుల్లోనే సెంచరీ బాదిన బిహార్ కెప్టెన్ సకీబుల్ గనీ లిస్ట్ ఏ క్రికెట్‌లోనే ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన భారత ఆటగాడిగా నిలిచాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే కని వినీ ఎరుగని రీతిలో బిహార్ 574/6 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసి వరల్డ్ రికార్డ్ సాధించింది.

ప్లేయర్ | జట్టు | స్కోర్ | ప్రత్యర్థి |
విరాట్ కోహ్లీ | ఢిల్లీ | 131 | ఆంధ్ర |
రోహిత్ శర్మ | ముంబై | 155 | సిక్కిం |
ఇషాన్ కిషన్ | జార్ఖండ్ | 125 | కర్ణాటక |
దేవదత్ పడిక్కల్ | కర్ణాటక | 147 | జార్ఖండ్ |
వైభవ్ సూర్యవంశీ | బిహార్ | 190 | అరుణాచల్ ప్రదేశ్ |
సకీబుల్ గని | బిహార్ | 128 | అరుణాచల్ ప్రదేశ్ |
ఆయుశ్ | బిహార్ | 116 | అరుణాచల్ ప్రదేశ్ |
యశ్ దూబే | మధ్యప్రదేశ్ | 103 | రాజస్థాన్ |
విష్ణు వినోద్ | కేరళ | 102 | త్రిపుర |
శుభమ్ | జమ్మూ కశ్మీర్ | 129 | చండీగఢ్ |
అమన్ మోఖడే | విదర్భ | 110 | బెంగాల్ |
ధ్రువ్ షౌరే | విదర్భ | 136 | బెంగాల్ |
స్నేహల్ | గోవా | 107 | ఛత్తీస్‌గఢ్ |
స్వస్తిక్ సమల్ | ఒడిశా | 212 | సౌరాష్ట్ర |
బిప్లాబ్ | ఒడిశా | 100 | సౌరాష్ట్ర |
సమ్మర్ గజ్జర్ | సౌరాష్ట్ర | 132 | ఒడిశా |
హిమాన్షు | హరియాణా | 126 | రైల్వేస్ |
రవి సింగ్ | రైల్వేస్ | 109 | హరియాణా |
రికీ భుయ్ | ఆంధ్ర | 122 | ముంబై |
జతిన్ | మణిపూర్ | 101 | నాగాలాండ్ |
అర్పిత్ | మేఘాలయ | 104 | మిజోరం |
కిషన్ లింగ్డో | మేఘాలయ | 106 | మిజోరం |