ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీని కర్ణాటక సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని కర్ణాటక 36 పరుగుల తేడాతో కరుణ్ నాయర్ కెప్టెన్సీలోని విదర్భను ఓడించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ శ్రేయస్ గోపాల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో కర్ణాటక విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక విజేతగా నిలవడం ఇది ఐదోసారి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 348 పరుగులు చేసింది. రవిచంద్రన్ సమరణ్(92 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 101) సెంచరీతో చెలరేగాడు. కృష్ణన్ శ్రీజిత్(74 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 78), అభినవ్ మనోహర్(42 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 79) హాఫ్ సెంచరీలతో రాణించారు. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే(2/67), నచికేత్ భుటే(2/70) రెండేసి వికెట్లు తీయగా.. యశ్ ఠాకూర్, యశ్ కడమ్ తలో వికెట్ తీసారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన విదర్భ 48.2 ఓవర్లలో 312 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది. ఓపెనర్ ధ్రువ్ షోరే(111 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 110) ఒక్కడే సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ కీలక ఫైనల్లో దారుణంగా విఫలమయ్యాడు. 31 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 27 పరుగులే చేసి వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్‌కు ముందు 7 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 112 నాటౌట్, 44 నాటౌట్, 163 నాటౌట్, 112, 122 నాటౌట్, 88 నాటౌట్‌లతో మొత్తం 752 పరుగులు చేసిన కరుణ్ నాయర్ ఆఖరి మ్యాచ్‌లో 27 పరుగులే చేసి 779 పరుగులతో ఈ టోర్నీని ముగించాడు. ఇంత అద్భుతమైన ప్రదర్శన కనబర్చినా.. అతన్ని సెలెక్టర్లు పట్టించుకోలేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్లలో చోటివ్వలేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో కరుణ్ నాయర్‌కు టీమిండియాకు ఎంపిక చేసే పరిస్థితి లేదని, ఎవరైన గాయపడితే అతని పేరును పరిశీలిస్తామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వివరణ ఇచ్చాడు. ఎన్ని పరుగులు చేసినా భారత జట్టులో చోటు దక్కలేదనే బాధనో ఏమో కానీ.. కీలక ఫైనల్లో కరుణ్ నాయర్ విఫలమయ్యాడు. దాంతో తొలిసారి ఫైనల్ చేరిన విదర్భ రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకుంది.