ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ టీమ్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. విదర్బతో రాజ్‌కోట్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో చిత్తయింది. ఈ టోర్నీలో హైదరాబాద్‌కు వరుసగా రెండో పరాజయం. తొలి మ్యాచ్‌లో యూపీ చేతిలో 84 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్‌లోనూ అదే తరహా పేలవ ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్ మరో ఘోర ఓటమిని చవిచూసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 365 పరుగుల భారీ స్కోర్ చేసింది. ధ్రువ్ షోరే(77 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 109) సెంచరీతో చెలరేగగా.. అమన్ మోఖడే(82), యశ్ రాథోడ్(68), రవికుమార్ సమర్థ్(63) హాఫ్ సెంచరీలతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో కార్తీకేయ కాక్(3/87) మూడు వికెట్లు తీయగా.. రక్షణ్ రెడ్డి, నితిన్ సాయి యాదవ్ చెరో వికెట్ తీసారు.
అనంతరం హైదరాబాద్ 49.2 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ గౌడ్(85) ఒక్కడే రాణించగా.. అభిరత్ రెడ్డి(43) పర్వాలేదనిపించాడు. విదర్భ బౌలర్లలో హర్ష్ దూబే(3/39) మూడు వికెట్లు తీయగా.. భుటే, యశ్ కదమ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. సోమవారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో అస్సాంతో హైదరాబాద్ తలపడనుంది. సౌరాష్ట్ర వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఢిల్లీ చేతిలో ఓడిన ఆంధ్ర.. రైల్వేస్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆలూర్ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆంధ్ర ప్లేయర్ హేమంత్ రెడ్డి(35 బంతుల్లో 41 నాటౌట్, 2/34) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రైల్వేస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 266 పరుగులు చేసింది. రవి సింగ్(76), అన్ష్ యాదవ్(59) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆంధ్ర బౌలర్లలో సత్యనారయణ రాజు, కలిదిండి రాజు మూడేసి వికెట్లు తీయగా.. హేమంత్ రెడ్డి రెండు వికెట్లు పడగొట్టాడు. నితీష్ కుమార్ రెడ్డికి ఒక వికెట్ దక్కింది.
అనంతరం ఆంధ్ర 44.4 ఓవర్లలోనే 4 వికెట్లకు 271 పరుగులు చేసి గెలుపొందింది. రికీ భుయ్(76), నితీష్ కుమార్ రెడ్డి(55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. శ్రీకర్ భరత్(25), అశ్విన్ హెబ్బర్(30), షేక్ రషీద్(40), హేమంత్ రెడ్డి(41 నాటౌట్) పర్వాలేదనిపించారు. సోమవారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఒడిశాతో ఆంధ్ర తలపడనుంది. అలూరు వేదికగానే ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా నితీష్ కుమార్ రెడ్డి ఫామ్‌లోకి వచ్చాడు. సోమవారం జరిగే మ్యాచ్‌లోనూ అతను చెలరేగితే.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో అతనికి అవకాశం దక్కనుంది.