టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో 2000 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్లలో అత్యధిక యావరేజ్ కలిగిన బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ నిలిచాడు. ఈ క్రమంలో అతను రుతురాజ్ గైక్వాడ్, మైఖఏల్ బెవన్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ల రికార్డ్‌లను అధిగమించాడు.
ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా హర్యానాతో జరిగిన సెమీఫైనల్లో ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్ 113 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 86 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫీల్డింగ్‌లోనూ 3 కీలక క్యాచ్‌లు అందుకొని కర్ణాటక ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కర్ణాటక 5 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన హర్యానా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 237 పరుగులు చేసింది. అనంతరం కర్ణాటక 47.2 ఓవర్లలోనే 5 వికెట్లకు 238 పరుగులు చేసి గెలుపొందింది. పడిక్కల్‌తో పాటు రవిచంద్రన్ సమరన్(76) రాణించాడు. ఈ మ్యాచ్ ద్వారా పడిక్కల్ లిస్ట్-ఏ క్రికెట్‌లో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఈ సీజన్‌లో ఏడు ఇన్నింగ్స్‌ల్లో 50+ రన్స్ చేశాడు. 86,102, 114, 93 నాటౌట్, 70, 117, 71 పరుగులతో రాణించాడు. 2021-22 విజయ్ హజారే ట్రోఫీలోనూ పడిక్కల్ వరుసగా ఏడు సార్లు 50 ప్లస్ రన్స్ చేశాడు. లిస్ట్ క్రికెట్‌లో పడిక్కల్ యావరేజ్ 82.38గా ఉంది. దాంతో లిస్ట్ క్రికెట్‌లో అత్యధిక యావరేజ్ కలిగిన బ్యాటర్‌గా పడిక్కల్ నిలిచాడు.
ఈ జాబితాలో పడిక్కల్ తర్వాత రుతురాజ్ గైక్వాడ్(58.16), మైకేల్ బేవన్(57.86), విరాట్ కోహ్లీ(57.05), ఏబీ డివిలియర్స్(53.47)లు కొనసాగుతున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో పడిక్కల్ నిలకడగా రాణించడంతో అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.