విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ మరో విజయాన్ని కైవసం చేసుకుంది. ఎలైట్ గ్రూప్ బీలో భాగంగా రాజ్‌కోట్ వేదికగా బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన హైదరాబాద్ 107 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
హైదరాబాద్ యువ ఓపెనర్ అమన్ రావు(154 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్‌లతో 200 నాటౌట్) అజేయ ద్విశతకంతో చెలరేగగా.. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్(4/58) నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. ఈ ఇద్దరి అసాధారణ ప్రదర్శనతో హైదరాబాద్ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 352 పరుగులు చేసింది. అమన్ రావు ద్విశతకంతో పాటు రాహుల్ సింగ్(54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. బెంగాల్ బౌలర్లలో మహమ్మద్ షమీ(3/70) మూడు వికెట్లు తీయగా.. షెహ్‌బాజ్ అహ్మద్, రోహిత్ కుమార్ తలో వికెట్ తీసారు.

అనంతరం బెంగాల్ 44.4 ఓవర్లలో 245 పరుగులకే ఆలౌటైంది. షెహ్‌బాజ్ అహ్మద్(113 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 108 నాటౌట్) అజేయ శతకంతో రాణించినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్ బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. చామ మిలింద్, రక్షణ్ రెడ్డి, నితిన్ సాయి యాదవ్, ప్రణవ్ వర్మ తలో వికెట్ తీసారు. నితేష్ రెడ్డి రెండు వికెట్లు పడగొట్టాడు.
తిలక్ వర్మ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత హైదరాబాద్‌కు వరుసగా రెండో విజయం ఇది. తిలక్, సిరాజ్ గైర్హాజరీలో హైదరాబాద్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. ఆఖరి మ్యాచ్‌లో గెలిచినా హైదరాబాద్ క్వార్టర్ ఫైనల్ చేరే పరిస్థితి లేదు. ఇతర మ్యాచ్‌ల్లో ముంబై, ఉత్తరఖాండ్, చండీఘడ్, యూపీ, బరోడా, కేరళ, జార్ఖండ్, కర్ణాటక, తమిళనాడు విజయం సాధించాయి.