చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. సౌతిండియా స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. ధోనీ అంటే పడి చచ్చిపోయే విఘ్నేష్ శివన్.. తన ఆరాధ్య క్రికెటర్‌ను తాజాగా కలిసాడు. ధోనీతో ప్రత్యేకంగా సమావేశమైన విఘ్నేష్ శివన్.. తన అభిమాన ఆటగాడి ఆటోగ్రాఫ్‌ను తీసుకున్నాడు.
అది కూడా తాను ధరించిన టీషర్ట్‌పై తీసుకున్నాడు. ఈ సందర్భంగా విఘ్నేష్ శివన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ధోనీని చూడగానే చిన్న పిల్లాడిలా మారిపోయిన విఘ్నేష్ శివన్.. మోకాలిపై కూర్చొని మరీ ధోనీపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఆటోగ్రాఫ్ తీసుకున్న వెంటనే ధోనీ చేతులు పట్టుకొని ఎమోషనల్ అయ్యాడు.

ధోనీ చేతికి ముద్దుపెట్టి ఇంతకన్నా నాకు ఇంకేం కావాలని ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో విఘ్నేష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
'నా హీరో, నా ఆరాధ్య దైవం, నా కెప్టెన్‌ను కలిసాను. ఆయన్ను కలిసిన ప్రతిసారీ తెలియని భావోద్వైగానికి లోనవుతూ ఉంటాను. నేను ఆయన్ను చూసిన ప్రతిసారి నా ముఖంలో వచ్చే ఆనందాన్ని చూసి మరింత ఆనందం పడుతూ ఉంటాను.
ధోనీ తమిళ ఇండస్ట్రీని ఎంచుకోవడం.. మొదటి చిత్రాన్ని ఇక్కడి నుంచే చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ధోనీ నుంచి వచ్చే చిత్రాలను థియేటర్లలో చూసి మా ప్రేమ, మద్దతు తెలియజేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం"అంటూ విఘ్నేష్ శివన్ తెలిపాడు.

సౌత్‌లో డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. నయన తారను ప్రేమించి.. పెళ్లాడిని తర్వాత విఘ్నేష్ పేరు పాన్ ఇండియా లెవల్లో మారు మోగుతోంది. ఇక విఘ్నేష్ శివన్.. ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకోవడంపై చెన్నై ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. ధోనీ తదుపరి సినిమా విఘ్నేషన్‌తోనేనా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇటీవలే సినిమా రంగంలో నిర్మాతగా అడుగుపెట్టిన ధోనీ... తన సతీమణి సాక్షి సింగ్ సాయంతో 'ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్' పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాడు. తమిళంలో 'ఎల్‌జీఎమ్'(లెట్స్ గెట్ మ్యారీడ్)' పేరిట తొలి సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కోసం చెన్నైకి సతీసమేతంగా వచ్చిన ధోనీ.. అక్కడే మూవీ ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు.