
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూతురిని ఆ జట్టు యువ పేసర్ షాహిన్ అఫ్రిది పెళ్లి చేసుకోనున్నాడని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు షహీన్ షా కుటుంబ సభ్యులు తమ కుటుంబాన్ని కలిసి మాట్లాడినట్లు అఫ్రిది కూడా ట్విటర్ ద్వారా స్పష్టం చేశాడు. పెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయమవుతాయని, ఆ అల్లా దయతలిస్తే వీళ్ల పెళ్లి కూడా జరుగుతుందని అఫ్రిది ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా.. కాబోయే మామ, అల్లుడిపై మాత్రం సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో షాహిద్ అఫ్రిది ముల్తాన్ సుల్తాన్‌కు ఆడుతుండగా.. షాహిన్ అఫ్రిది క్వెటా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో షాహిన్ వేసిన ఓవర్‌లో షాహిద్ అఫ్రిది సిక్స్ కొట్టాడు. అయితే ఆ తర్వాతి బంతికే అఫ్రిది షాహిన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
ఈ వీడియోను అభిమానులు తమదైన శైలిలో మీమ్ చేశారు. బాలీవుడ్ హిట్ సినిమా దుల్హే రాజాలోని ''సునో సస్రూజీ అబ్ జిద్ చాడో'' అంటూ సాగిన పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టారు. ''మామ.. ఇప్పటికైనా మీ మొండితనాన్ని వదిలేయండి'' అనేది ఈ పాట అర్థం. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే తమ ప్రపోజల్‌ను అఫ్రిది కుటుంబం అంగీకరించిందని షాహిన్ అఫ్రిది తండ్రి తెలిపారు. ప్రస్తుతం షాహిన్ కెరీర్ ఆరంభంలోనే ఉందని, వచ్చే రెండేళ్లలో నిఖా చేస్తామన్నారు. కరోనా కారణంగా పీఎస్‌ఎల్ 2021 సీజన్ అర్ధాంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. షహీన్ షా అఫ్రిది పాకిస్థాన్ తరఫున 2018లో టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అదే ఏడాది వన్డేలు, టెస్టుల్లోనూ ఆడాడు. 22 టీ20ల్లో 24 వికెట్లు, 21 వన్డేల్లో 45 వికెట్లు, 15 టెస్టుల్లో 48 వికెట్లు తీశాడు.