
న్యూఢిల్లీ: రూ.100 పెట్టు రూ.1000 సంపాదించూ అని ఆశచూపి ఫేక్ ఐపీఎల్ మ్యాచ్‌ల పేరిట గుజరాత్ గ్యాంగ్ చేసిన భారీ మోసాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. తోట కూలీలనే ప్లేయర్లుగా మార్చి.. యూట్యూబ్ వేదికగా ఫేక్ ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్షప్రసారాలతో అందినకాడికి దోచుకున్న దుండగులను మోహ్సనా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫేక్ ఐపీఎల్‌ను నిర్వహించిన విధానం ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది.
గుజరాత్‌లోని మెహ్సనా జిల్లా మోలిపూర్ గ్రామానికి చెందిన కొందరు యువకులు యూట్యూబ్ వేదికగా ఫేక్ ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేశారు. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జెర్సీలను తోట పనిచేసే కూలీలకు వేయించి మ్యాచ్‌లు నిర్వహించారు. అంతటితో ఆగకుండా ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే వాయిస్‌ను మిమిక్రీ చేస్తూ.. నిజమైన ఐపీఎల్ మ్యాచ్‌లను చూస్తున్న అనుభూతిని కలిగించారు. ఒక్కో మ్యాచ్‌లో ప్లేయర్లుగా నటించేందుకు కూలీ పని చేసేవాళ్లకు రోజుకు రూ.400 ఇచ్చి తీసుకొచ్చారు.
స్టేడియంలో వేల మంది మ్యాచుల చూస్తున్నట్టుగా గ్రాఫిక్స్, సౌండ్స్ యాడ్ చేసారు. ఈ మ్యాచ్‌లను చూసి నిజమైన ఐపీఎల్ మ్యాచ్‌లని నమ్మిన రష్యా జనాలు, టెలిగ్రామ్ ద్వారా బెట్టింగ్ వేసారు. ప్లానింగ్ ప్రకారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లతో రష్యాకు చెందిన టివర్, వొరోనెజ్, మాస్కో నగరాలకు చెందిన చాలా మంది లక్షల్లో డబ్బులు పొగొట్టుకున్నారు. దాంతో వారు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్న మెహ్సానా పోలీసులు ఈ హవాలా చానెల్ నడిపిస్తున్న నలుగురిని అరెస్ట్ చేయగలిగారు.
మహేంద్ర సంస్థల అధినేత ఆనంద్ మహేంద్ర కూడా ఈ భారీ మోసానికి ఫిదా అయ్యాడు.'ఇది నమ్మశక్యం కాకుండా ఉంది. దీన్ని వాళ్లు 'మెటావర్స్ ఐపీఎల్' అని పిలిచి ఉంటే, బిలియన్ డాలర్లు సంపాదించేవాళ్లు.'అంటూ కామెంట్ చేశాడు. తన వాయిస్‌ని ఇమిటేట్ చేశారని తెలిసిన క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే, 'నవ్వకుండా ఉండలేకపోతున్నా... వాళ్ల కామెంటరీ తప్పకుండా ఓ సారి వినాలి.'అని ట్వీట్ చేశాడు. అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ కాన్ గ్యాంగ్ ఫేక్ ఐపీఎల్ మ్యాచ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.