ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2024-25 టైటిల్‌ను విదర్భ సొంతం చేసుకుంది. కేరళతో నాగ్‌పూర్ వేదికగా ఆదివారం ముగిసిన ఫైనల్ మ్యాచ్ డ్రా అయ్యింది. దాంతో ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన విదర్భను అంపైర్లు విజేతగా ప్రకటించారు. రంజీ ట్రోఫీ చరిత్రలో విదర్భ జట్టుకు ఇది మూడో టైటిల్. గత 7 ఏళ్లలోనే ఈ మూడు టైటిల్ అందుకోవడం విశేషం. ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీని తృటిలో చేజార్చుకున్న విదర్భ.. రంజీ ట్రోఫీని మాత్రం కైవసం చేసుకుంది. విదర్భ విజయంలో టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ కీలక పాత్ర పోషించారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో అతను బ్యాట్‌తో రాణించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 123.1 ఓవర్లలో 379 పరుగులకు ఆలౌటైంది. డానిష్ మలెవర్(285 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 153) సెంచరీతో చెలరేగగా.. కరుణ్ నాయర్(188 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 86) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. అనంతరం కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 125 ఓవర్లలో 342 పరుగులే చేసింది. కెప్టెన్ సచిన్ బేబీ(235 బంతుల్లో 10 ఫోర్లతో 98) సెంచరీ చేజార్చుకోగా.. ఆదిత్య సర్వతే(185 బంతుల్లో 10 ఫోర్లతో 79) హాఫ్ సెంచరీతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో విదర్భకు 37 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ 143.5 ఓవర్లలో 9 వికెట్లకు 375 పరుగులు చేసింది. కరుణ్ నాయర్(295 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 135) సెంచరీతో చెలరేగగా.. డాని మలేవర్(162 బంతుల్లో 5 ఫోర్లతో 73), దర్శన్ నల్కండే(98 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆటకు చివరి రోజు కావడం విదర్భ తన బ్యాటింగ్ కొనసాగిస్తుండటంతో మ్యాచ్ ఫలితం తేలే అవకాశాలు లేకపోవడంతో అంపైర్లు ఇరు జట్ల కెప్టెన్ల అంగీకారంతో మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన విదర్భను విజేతగా పేర్కొన్నారు.
విజయ్ హజారే ట్రోఫీలో వరుస సెంచరీలతో చెరలేగిన కరుణ్ నాయర్ కీలకమైన ఫైనల్లో మాత్రం తడబడ్డాడు. దాంతో ఆ జట్టు విజయ్ హజారే ట్రోఫీని అందుకోలేకపోయింది. కానీ రంజీ ట్రోఫీ ఫైనల్లో మాత్రం కరుణ్ నాయర్ మెరుగైన ప్రదర్శన చేసి విదర్భకు టైటిల్ అందించాడు.