రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బైక్స్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లలేదు. అతని ఫామ్ హౌస్‌లోని బైక్ కలెక్షన్స్ చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా వచ్చిన బైక్స్‌తో పాటు ఇష్టమైన వాటిని కొనుగోలు చేసిన ధోనీ తన ఫామ్ హౌస్‌లో ఓ గ్యారేజీనే మెయింటేన్ చేస్తున్నాడు.
సమయం దొరికినప్పుడల్లా వాటిపై అలా షికారుకు వెళ్తుంటాడు. అంతేకాకుండా సొంతంగా బైక్స్ మరమ్మత్తులు చేస్తూ ఉంటాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను గతంలో చాలా సార్లు చూశాం. తాజాగా టీమిండియా మాజీ పేసర్, సెలెక్టర్ వెంకటేశ్ ప్రసాద్.. ధోనీ బైక్ కలెక్షన్స్ చూసి బిత్తరపోయాడు.

సహచర మాజీ ప్లేయర్ సునీల్ జోషితో కలిసి ధోనీ ఇంటిని సందర్శించిన వెంకటేశ్ ప్రసాద్.. అతని బైక్ కలెక్షన్స్‌కు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ధోనీ గ్యారేజీలో బైక్స్‌తో పాటు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.
'బైక్స్‌పై ఇంత పిచ్చి ఉన్న వ్యక్తిని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఇదీ ఏం కలెక్షన్. ధోనీ ఏం మనిషి. అతనో గొప్ప అచీవర్. అంతకుమించి గొప్ప వ్యక్తి. రాంచీలోని అతని ఇంటిలోని ఈ బైక్, కార్ల కలెక్షన్లు చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తున్నాయి. ఇవన్నీ ధోనీ అభిరుచి, పిచ్చికి నిదర్శనంగా నిలుస్తున్నాయి'అని వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్ చేశాడు.
ఈ వీడియోలో వెంకటేశ్ ప్రసాద్.. ధోనీ సతీమణి సాక్షి సింగ్‌తో మాట్లాడాడు. 'తొలిసారి రాంచీ వచ్చినట్టున్నారు? మీ ఫీలింగ్ ఎలా ఉంది?'అని సాక్షి సింగ్ అడగ్గా.. 'అద్భుతం. రాంచీకి రావడం ఇదే తొలిసారి కాదు. నాలుగోసారి. కానీ ధోనీ బైక్ కలెక్షన్ మాత్రం క్రేజీ. ఎంతో పిచ్చి ఉంటే తప్పా ఇన్నీ బైక్స్ కలెక్ట్ చేయడం సాధ్యం కాదు.
ఇది బైక్ షో రూమ్‌లానే ఉంది. ఎదైనా కావాలంటే దానిపై పిచ్చి ఉండాలి. 'అని వెంకటేశ్ ప్రసాద్ బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ బైక్ కలెక్షన్స్ చూసి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. బాప్‌రే.. ఇన్ని బైకులా? అని కామెంట్ చేస్తున్నారు. ధోనీ బైక్స్ కలెక్షన్‌లో ఖరీదైన వాటితో పాటు మాములు బైక్స్ కూడా ఉన్నాయి.