న్యూఢిల్లీ: వెస్టిండీస్ గడ్డపై పరాజయాల పరంపర కొనసాగిస్తున్న టీమిండియాపై మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. జట్టులో ఒక్కడికి కూడా గెలవాలనే కసిలేదని మండిపడ్డాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ అయితే మరీ దారుణంగా ఉందని విమర్శించాడు. ఆదివారం జరిగిన రెండో టీ20లోనూ టీమిండియా 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
టెస్ట్, వన్డే సిరీస్‌లను సునాయసంగా గెలిచిన టీమిండియా.. టీ20ల్లో మాత్రం తడబడుతోంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని కుర్రాళ్లు వరుసగా విఫలమవుతున్నారు. దాంతో టీమిండియా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఈ పరాజయాలపై ట్వీటర్ వేదికగా ఘాటుగా స్పందించిన వెంకటేశ్ ప్రసాద్.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ముఖ్యంగా అతను బౌలర్లను ఉపయోగించిన తీరు బాలేదన్నాడు. 'వెస్టిండీస్‌తో రెండో టీ20లో టీమిండియా చాలా సాధారణంగా ఆడింది. ఒక్కరిలో కూడా గెలవాలనే కసి కనిపించలేదు. 2007 టీ20 ప్రపంచకప్ తర్వాత 2008లో ఐపీఎల్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 7 సార్లు టీ20 ప్రపంచకప్ జరిగితే భారత ఒక్క టైటిల్ కూడా గెలవలేదు.
ఇందులో ఒక్కసారి మాత్రమే ఫైనల్ చేరింది. భారత్ తరఫున ఆడుతున్న కుర్రాళ్లలో గెలవాలనే కసి ఉండటం చాలా ముఖ్యం. రెండో టీ20లో భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఘోర తప్పిదం చేశాడు. కీలక సమయంలో ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన చాహల్‌కు పూర్తి కోటా ఓవర్లు బౌలింగ్ ఇవ్వకపోవడం వ్యూహాత్మక తప్పిదం.
ఇలాంటి సమయాల్లో కెప్టెన్‌గా తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి'అని వెంకటేశ్ ప్రసాద్ వరుస ట్వీట్లలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. తెలుగు తేజం తిలక్ వర్మ(41 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 51) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. హార్దిక్ పాండ్యా(24), ఇషాన్ కిషన్(27), శుభ్‌మన్ గిల్(7), సూర్యకుమార్ యాదవ్(1), సంజూ శాంసన్(7) దారుణంగా విఫలమయ్యారు. వెస్టిండీస్ బౌలర్లలో అకీల హొస్సెన్, అల్జారీ జోసెఫ్, రొమారియో షెఫెర్డ్ రెండేసి వికెట్లు తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ 18.5 ఓవర్లలో 155 పరుగులు చేసి గెలుపొందింది. నికోలస్ పూరన్(40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. చివర్లో అకీల హోస్సెన్(16 నాటౌట్), అల్జారీ జోసెఫ్(10 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీయగా.. యుజ్వేంద్ర చాహల్ రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్ చెరో వికెట్ తీసారు.