ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా సౌతాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా జరుగుతన్న సూపర్-8 పోరులో టీమిండియా మ్యాచ్ విన్నర్లు, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తేలిపోయారు. సౌతాఫ్రికా బ్యాటర్లు టార్గెట్ చేసి ఆడటంతో తమ శైలికి భిన్నంగా ధారళంగా పరుగిలిచ్చుకున్నారు.
గత నాలుగు మ్యాచ్‌ల్లో అసాధారణ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన వరుణ్ చక్రవర్తీ ఈ మ్యాచ్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపర్చాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన వరుణ్ క్రవర్తీ 11.75 ఎకానమీతో 47 పరుగులు సమర్పించుకున్నాడు. తన ఆఖరి ఓవర్‌లో డేంజరస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్(35 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 63)ను ఔట్ చేసి ఊపిరి పీల్చుకున్నాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 11.25 ఎకానమీతో 45 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా చివరి ఓవర్‌లో అతను ఇచ్చిన 20 పరుగులు మూమెంటమ్‌ను సౌతాఫ్రికా వైపు మళ్లించింది.

వరుణ్ చక్రవర్తీ, హార్దిక్ పాండ్యా విఫలమైనా.. అర్ష్‌దీప్ సింగ్(2/28), జస్‌ప్రీత్ బుమ్రా(3/15) రఫ్పాడించడంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ హాఫ్ సెంచరీతో పాటు డెవాల్డ్ బ్రెవిస్(29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45), ట్రిస్టన్ స్టబ్స్(24 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 44 నాటౌట్) దూకుడుగా ఆడారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. జస్‌ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగి వరుస ఓవర్లలో క్వింటన్ డికాక్(6), ర్యాన్ రికెల్టన్(7) ఔట్ చేయగా.. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(4) అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో వికెట్లు తీసి సౌతాఫ్రికా పతనాన్ని శాసిస్తాడని భావించిన వరుణ్ చక్రవర్తీ తేలిపోయాడు. మిల్లర్, బ్రెవిస్ అతనిపై భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. 26 బంతుల్లో మిల్లర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు హాఫ్ సెంచరీకి చేరువైన బ్రెవిస్‌ను శివమ్ దూబే క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 97 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది.
బ్రెవిస్ ఔటైనా.. స్టబ్స్‌తో కలిసి మిల్లర్ చెలరేగాడు. దూకుడుగా ఆడుతున్న అతన్ని వరుణ్ పెవిలియన్ చేర్చాడు. దాంతో సౌతాఫ్రికా పరుగుల వేగం తగ్గింది. డెత్ ఓవర్లలో అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా కట్టడిగా బౌలింగ్ చేశారు. కానీ ఆఖరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా 20 పరుగులివ్వడంతో సౌతాఫ్రికా 187 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ ఓవర్‌లో స్టబ్స్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను సుందర్ నేలపాలు చేశాడు. దాంతో అతను 16 పరుగులు పిండుకున్నాడు.