రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ శతకం సాధించడంపై అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ సంతోషం వ్యక్తం చేశారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, సపోర్ట్ స్టాఫ్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి సహకారంతోనే తన కొడుకు కల నెరవేరిందని చెప్పారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101) విధ్వంసకర శతకంతో చెలరేగిన విషయంతో తెలిసిందే.
35 బంతుల్లో సెంచరీ సాధించి టీ20 క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన అతి పిన్నవయస్కుడిగా వైభవ్ వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. సూర్యవంశీ ధాటికి 210 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 25 బంతులు మిగిలి ఉండగానే చేధించి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్‌లో 5 వరుస పరాజయాల తర్వాత విజయాన్నందుకుంది. ఈ సెంచరీతో సూర్యవంశీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.

వారికి ధన్యవాదాలు..
వైభవ్ సూర్యవంశీ సక్సెస్ వెనుక అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ శ్రమ ఎంతో ఉంది. వైభవ్‌ను క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు తనకు ఉన్న పొలాన్ని కూడా అమ్మేశారు. ఆ త్యాగానికి ఫలితం దక్కడంతో ఆయన ఆనందానికి హద్దే లేకుండా పోయింది. బిహార్ క్రికెట్ అసోసియేషన్ షేర్ చేసిన వీడియోలో.. తన కొడుకు కెరీర్‌కు సహకరించిన వారికి సంజీవ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
'వైభవ్ తన సెంచరీతో మా ఊరు, మా రాష్ట్రం బిహార్‌తో పాటు యావత్ దేశం గర్వపడేలా చేశాడు. మాకు ఇంతకన్నా సంతోషం లేదు. ఈ సెంచరీని మేం సెలెబ్రేట్ చేసుకుంటున్నాం. గత మూడు-నాలుగు నెలలుగా వైభవ్ ఆటపై పని చేసిన రాజస్థాన్ రాయల్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. అలాగే వైభవ్ ఆటను మరింత మెరుగుపర్చిన హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్‌కు నా కృతజ్ఞతలు.

ఆయనకు స్పెషల్ థ్యాంక్స్
వైభవ్ కూడా చాలా కష్టపడ్డాడు. దాని ఫలితమే ఈ సెంచరీ. బిహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాకేష్ తివారికి కూడా ధన్యవాదాలు. పిన్న వయసులోనే బిహార్ దేశవాళీ టీమ్‌కు ఎంపిక చేసి తుది జట్టులో ఆడే అవకాశం ఇచ్చారు.'అని సంజీవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.
తన తల్లిదండ్రుల కారణంగానే తాను ఈ స్థాయిలో ఆడుతున్నానని వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. తన ఆట కోసం తన తండ్రి పనిని వదులుకున్నాడని, తన అన్న ఆ బాధ్యతలు చేపట్టాడని చెప్పాడు. ఇల్లు గడవడానికి కష్టమైనా.. తన తండ్రి అండగా నిలిచాడని సూర్యవంశీ పేర్కొన్నాడు.