ఆస్ట్రేలియా గడ్డపై భారత అండర్ 19 జట్టు దుమ్మురేపుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆయుష్ మాత్రే సారథ్యంలోని భారత కుర్రాళ్ల జట్టు 51 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా అండర్ 19 టీమ్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. వైభవ్ సూర్యవంశీ(68 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 70), విహాన్ మల్హోత్ర(74 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 70), అభిజ్ఞాన్ కుందు(64 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71) హాఫ్ సెంచరీలతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.
కెప్టెన్ ఆయుష్ మాత్రే(0, 3/27) బ్యాటింగ్‌లో విఫలమైన బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత అండర్ 19 జట్టు 49.4 ఓవర్లలో 30 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా అండర్ 19 బౌలర్లలో విల్ బైరమ్ మూడు వికెట్లు తీయగా.. యశ్ దేశ్‌ముఖ్ రెండు వికెట్లు పడగొట్టాడు. బార్టన్, స్కిల్లర్, జాన్ జేమ్స్, ఆర్యన్ శర్మ తలో వికెట్ తీసారు.

అనంతరం ఆస్ట్రేలియా అండర్ 19 జట్టు 47.2 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది. జయ్‌డెన్ డ్రాపర్(72 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 107) సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఆర్యన్ శర్మ(44 బంతుల్లో 2 ఫోర్లతో 38) పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత అండర్ 19 బౌలర్లలో ఆయుష్ మాత్రే(3/27) మూడు వికెట్లు తీయగా.. కాన్షిక్ చౌహన్(2/50) రెండు వికెట్లు పడగొట్టాడు. కిషన్ కుమార్, ఆర్‌ఎస్ అంబ్రిష్, ఖిలన్ పటేల్, విహాన్ మల్హోత్ర తలో వికెట్ తీసారు. ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ కొట్టిన ఓ సిక్సర్ స్టేడియం బయట పడింది.
ఇరు జట్ల మధ్య మూడో వన్డే శుక్రవారం బ్రిస్బేన్ వేదికగా జరగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. బ్రిస్బేన్ వేదికగానే సెప్టెంబర్ 30 నుంచి తొలి టెస్ట్, అక్టోబర్ 7 నుంచి మకే వేదికగా రెండో టెస్ట్ జరగనుంది.