14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రంతో ఆశ్చర్యపరిచి.. తొలి బంతినే సిక్స్ కొట్టి ఔరా అనిపించిన రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్య వంశీ(38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101) తన మూడో మ్యాచ్‌లోనే విధ్వంసకర శతకంతో చెలరేగాడు. మేటి బౌలర్లంతా భయపడేలా.. ఖతర్నాక్ బ్యాటింగ్‌తో గుజరాత్ టైటాన్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. పేసర్, స్పిన్నర్ అని తేడా లేకుండా సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 35 బంతుల్లోనే సెంచరీ బాది వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. అయితే అతనికి ఇది రాత్రికి రాత్రి వచ్చిన సక్సెస్ కాదు. ఈ కుర్రాడి విజయం వెనుక అతని తండ్రి త్యాగం ఉంది.
మాములు రైతు బిడ్డ..
వైభవ్ సూర్యవంశీ బీహార్, సమస్తిపూర్ జిల్లాలోని తాజ్‌పూర్ గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఒక మాములు రైతు. ఆయన క్రికెటర్ కావాలని కలలు కన్నారు. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదు. దాంతో ఆ కలను తన కొడుకు ద్వారా నెరవేర్చుకోవాలనుకున్నారు. నాలుగేళ్ల వయసులోనే వైభవ్‌కు క్రికెట్ ఓనమాలు నేర్పారు. ఆ తర్వాత సమస్తిపూర్‌లోని ఒక క్రికెట్ అకాడమీలో చేర్పించారు. అనంతరం మాజీ రంజీ ప్లేయర్ మనీష్ ఓఝా వద్ద శిక్షణ ఇప్పించారు.

పొలం అమ్మి..
ఒక సాధారణ రైతు అయినప్పటికీ, తన కుమారుడు క్రికెటర్‌గా ఎదగాలనే కలను సాకారం చేయడానికి సంజీవ్ ఎన్నో త్యాగాలు చేశారు. వైభవ్ క్రికెట్ శిక్షణ ఖర్చులు భారం కావడంతో తనకున్న కొంత భూమిని కూడా అమ్మేశారు. 9 ఏళ్ల వయసులో వైభవ్.. 100 కిలోమీటర్లు ప్రయాణించి పాట్నాలోని క్రికెట్ అకాడమీకి తీసుకెళ్లేవారు. వైభవ్‌తో పాటు అతనికి బౌలింగ్ చేసే నెట్ బౌలర్ల కోసం దాదాపు 10 టిఫిన్ బాక్స్‌లు పట్టుకెళ్లేవారు. ఈ విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంజీవ్ పంచుకున్నారు.
9వ తరగతి స్టూడెంట్..
ప్రస్తుతం వైభవ్.. బీహార్, తాజ్‌పూర్‌లోని డాక్టర్ ముక్తేశ్వర్ సిన్హా మోడెస్టీ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. క్రికెట్ కారణంగా అతను తన చదవుపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నాడు. ఖాళీ సమయంలో మాత్రమే స్కూల్‌కు వెళ్తున్నాడు. అయితే చదువు, ఆటను వైభవ్ బ్యాలెన్స్ చేస్తున్నాడని అతని చిన్ననాటి కోచ్ బ్రజేష్ మీడియాకు తెలిపారు.
రోజుకు 600 బాల్స్..
వైభవ్ సూర్యవంశీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించేవాడని అతని కోచ్ మనీష్ ఓఝా తెలిపారు. ఉదయం 7.30 నుంచే శిక్షణ ప్రారంభించేవాడని, ప్రతీ రోజు 600 బంతులు ఆడేవాడని చెప్పారు. ఈ కఠినమైన దినచర్య నాలుగేళ్ల పాటు కొనసాగిందన్నారు. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడానికి వీలుగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే సైడ్-ఆర్మ్ త్రోడౌన్‌లను కూడా ప్రాక్టీస్ చేసేవాడని మనీష్ ఓఝా పేర్కొన్నారు. వైభవ్ టాలెగావ్‌లోని అత్యాధునిక అకాడమీలో కూడా శిక్షణ పొందాడని చెప్పారు.
ఆస్ట్రేలియాపై సెంచరీ..
ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుతో జరిగిన యూత్ టెస్ట్‌లో సూర్య వంశీ సెంచరీ సాధించి తొలి సారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ 62 బంతుల్లో 104 పరుగులు చేశాడు. 58 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ ప్రదర్శనతో బిహార్ తరఫున రంజీ ట్రోఫీ ఆడే అవకాశాన్ని అందుకున్నాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులోనే రంజీ క్రికెట్ ఆడి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత బిహార్ తరఫున లిస్ట్ ఏ క్రికెట్ ఆడాడు.
వేలంలో కోటి..
తమ ప్రాక్టీస్ క్యాంపుల్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్.. మెగా వేలంలో రూ. కోటి 10 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ టినేజ్ కుర్రాడికి అంత ధర ఏంటని అప్పట్లో అందరూ అవాక్కయ్యారు. కెప్టెన్ సంజూ శాంసన్ గాయంతో జట్టుకు దూరమవడంతో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కింది. లక్నోతో మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన సూర్యవంశీ.. తొలి బంతినే సిక్సర్‌గా తరలించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఆర్‌సీబీతో విఫలమైనా.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్స్‌లు బాదాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడి 50.33 సగటు,215.71 స్ట్రైక్‌రేట్ తో 151 పరుగులు చేశాడు. అతని ఫియర్‌లెస్ గేమ్ చూస్తుంటే.. భవిష్యత్తులో భారత క్రికెట్‌ను ఎలేలా కనిపిస్తున్నాడు.