రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో సెంచరీ సాధించి వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. 14 ఏళ్ల వయసులోనే వరల్డ్ క్లాస్ బౌలర్లను ఊచకోత కోసాడు. అతని ధాటికి ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని 25 బంతులు మిగిలి ఉండగానే చేధించింది.
వైభవ్ సూర్యవంశీ కారణంగా గుజరాత్ టైటాన్స్ తరఫున అరంగేట్రం చేసిన అఫ్గాన్ ప్లేయర్ కరీమ్ జనత్‌కు ఆ ఆనందమే లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన కరీమ్ జనత్.. వైభవ్ సూర్యవంశీ ధాటికి తన తొలి ఓవర్‌లోనే 30 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో అతని అరంగేట్రం ఓ పీడకలగా మిగిలిపోయింది.

అరంగేట్రం పీడకలగా..
కరీమ్ జనత్ వేసిన 10వ ఓవర్‌లో వైభవ్ సూర్యవంశీ వరుసగా.. 6, 4, 6, 4, 4, 6 బాది 30 పరుగులు పిండుకున్నాడు. అతను వేసిన ప్రతీ బంతిని బౌండరీకి తరలించాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్, లెగ్ కట్టర్, స్లోయర్, యార్కర్, షార్ట్ ఆఫ్ లెంగ్త్, ఆఫ్ కట్టర్ బాల్స్ వేసినా.. వైభవ్ సూర్యవంశీ బౌండరీలు బాదాడు. ప్రస్తుతం ఈ ఓవర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఒక్క ఓవర్‌తోనే మ్యాచ్ వన్‌సైడ్‌గా మారిపోయింది. సూర్యవంశీ బ్యాటింగ్‌పై యావత్ క్రికెట్ ప్రపంచం నివ్వెరపోతుంది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ నుంచి సాధారణ అభిమాని వరకు ఈ 14 ఏళ్ల కుర్రాడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
వన్‌సైడ్‌గా హైస్కోరింగ్ గేమ్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 209 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(50 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84), జోస్ బట్లర్(26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా.. సాయి సుదర్శన్(30 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ బౌలర్లలో తీక్షణ(2/35) రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ 15.5 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసి గెలుపొందింది. వైభవ్ సూర్యవంశీ సెంచరీకి తోడుగా యశస్వి జైస్వాల్(40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. రియాన్ పరాగ్(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్) పర్వాలేదనిపించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు.