అండర్ 19 ఆసియా కప్ 2024 టోర్నీ భారత యువ జట్టు ఫైనల్ చేరింది. శ్రీలంక అండర్ 19 జట్టుతో శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత అండర్ 19 జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా యువ సెన్సేషన్, 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(36 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67) మరోసారి విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులకు కుప్పకూలింది. శ్రీలంక బ్యాటర్లలోలాక్విన్ అబే సింఘే(110 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) హాఫ్ సెంచరీతో రాణించగా.. శారుజన్ షణ్ముగనాథన్(78 బంతుల్లో 2 ఫోర్లతో 42) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో చేతన్ శర్మ(3/34) మూడు వికెట్లు తీయగా.. కిరణ్, ఆయుష్ మాత్రే రెండేసి వికెట్లు పడగొట్టారు. యుధజిత్ గుహ, హార్దిక్ రాజ్‌కు చెరో వికెట్ దక్కింది.

అనంతరం భారత అండర్ 19 జట్టు 21.4 ఓవర్లలోనే 3 వికెట్లకు 175 పరుగులు చేసి 170 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. వైభవ్ సూర్యవంశీతో పాటు ఆయుష్ మాత్రే(28 బంతుల్లో 7 ఫోర్లతో 34) రాణించాడు. కెప్టెన్ మహమ్మద్ అమాన్(26 బంతుల్లో 2 ఫోర్లతో 25 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. శ్రీలంక బౌలర్లలో విహాస్, విరన్, ప్రవీణ్ తలో వికెట్ తీసారు.
13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మరోసారి 5 సిక్సర్లతో అలరించాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 1.10 కోట్లు పలికి అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ.. ఈ టోర్నీ తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లో ఒక్క పరుగే చేసిన ఈ చోటా సూరీడు.. జపాన్‌తో 23 పరుగులకే వెనుదిరిగాడు. యూఏఈతో జరిగిన మూడో మ్యాచ్‌లో మాత్రం తన అసలు సిసలు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 46 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76 పరుగులతో అజేయంగా నిలిచాడు.
శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో అదే జోరు కనబర్చాడు. రాజస్థాన్ రాయల్స్ ఈ చోటా సూరీడుని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ వేలంలో అమ్ముడైన ఆటగాడిగా ఈ బీహార్ కుర్రాడు రికార్డ్ సాధించాడు. అంతేకాకుండా అండర్ 19 క్రికెట్ చరిత్రలోనే అతి పిన్నవయస్కుడిగా కూడా నిలిచాడు. డిసెంబర్ 10న దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్ జట్టుతో భారత్ తలపడనుంది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.