Vaibhav Suryavanshi: ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ 2026లో విజేతగా నిలవడంపై టీమిండియా టీనేజ్ సెన్షేషన్ వైభవ్ సూర్యవంశీ సంతోషం వ్యక్తం చేశాడు. సపోర్ట్ స్టాఫ్ శ్రమ ఫలితమే ఈ విజయమని చెప్పుకొచ్చాడు. అందుకే తన ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును వారికి అంకితమిస్తున్నట్లు తెలిపాడు. అండర్ 19 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన టీమిండియా ఆరో టైటిల్‌ను ముద్దాడింది. ఇంగ్లండ్‌తో గురువారం జరిగిన ఫైనల్లో భారత్ 100 పరుగులతో విజయం సాధించింది. ఈ టోర్నీలో ఓటమెరుగని జట్టుగా టైటిల్ అందుకుంది.
ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్స్‌లతో 175) విధ్వంసకర శతకంతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. 15 ఫోర్లు, 15 సిక్స్‌లతో 30 బంతుల్లోనే 150 పరుగులు చేశాడు. ఈ అసాధారణ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా చరిత్రకెక్కాడు.

ఈ సందర్భంగా మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ.. గత 7-8 నెలలుగా పడ్డ కష్టానికి దక్కిన ఫలితమని చెప్పాడు. 'చాలా సంతోషంగా ఉంది. నా మనసులో ఉన్న భావాలను మాటల్లో చెప్పలేకపోతున్నా. గత 7-8 నెలలుగా మేం, మా సపోర్ట్ స్టాఫ్ పడ్డ కష్టానికి దక్కిన ఫలితం ఇది. అందుకే ఈ అవార్డును మా సపోర్ట్ స్టాఫ్‌కు అంకితం చేస్తున్నాను. మేం అనవసరమైన ఒత్తిడికి లోనవ్వలేదు.
టోర్నీ మొత్తం మేం ఎలాగైతే రాణించామో.. అదే పద్ధతిని పాటిస్తూ మా సహజ సిద్ధమైన ఆట ఆడాలని అనుకున్నాం. కేవలం ఆసియా కప్ సమయంలోనే కాదు, గత 8-9 నెలలుగా మా సన్నద్ధత చాలా బాగుంది. ఆ సమయంలో మేం ఎంత కష్టపడ్డామో కేవలం మా ఆటగాళ్లకు మాత్రమే తెలుసు. నా నైపుణ్యాల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. పెద్ద మ్యాచ్‌ల్లో నేను రాణించగలనని నాకు తెలుసు.. ఈ రోజు అది నిజమైంది.'అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత అండర్ 19 టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ(80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్స్‌లతో 175) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. కెప్టెన్ ఆయుష్ మాత్రే(51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీ సాధించాడు. అభిజ్ఞాన్ కుండు(40), విహాన్ మల్హోత్రా(30), వేదాంత్ త్రివేది(32), కాన్షిక్(37 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ రెండేసి వికెట్లు తీయగా.. జేమ్స్ మింటో(3/63) మూడు వికెట్లు పడగొట్టాడు. మన్నీ లమ్స్‌డెన్ ఒక వికెట్ తీసాడు.
అనంతరం ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కాలెబ్ ఫాల్కోనర్(67 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 115) సెంచరీతో రాణించినా.. బెన్ డాకిన్స్(56 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో సత్తా చాటినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో అంబ్రిష్(3/56) మూడు వికెట్లు తీయగా.. దీపేష్ దేవండ్రన్(2/64), కాన్షిక్ చౌహన్(2/63) రెండేసి వికెట్లు తీయగా.. ఖిలాన్ పటేల్, ఆయుష్ మాత్రే తలో వికెట్ తీసారు.