ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపుతున్నాడు. వన్డే ఫార్మాట్‌లో పరుగుల మోత మోగించిన ఈ చిచ్చర పిడుగు.. టెస్ట్ ఫార్మాట్‌లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియా అండర్ 19తో జరుగుతున్న తొలి యూత్ టెస్ట్‌లో వైభవ్ సూర్యవంశీ సెంచరీతో చెలరేగాడు. తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో 78 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో సూర్యవంశీ 7 సిక్స్‌లు బాదడం గమనార్హం.
తద్వారా యూత్ టెస్ట్‌ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌గా రికార్డ్ సాధించాడు. ఈ క్రమంలో అతను అండర్ 19 ఏ కెప్టెన్ ఆయుష్ మాత్రే రికార్డ్‌ను అధిగమించాడు. యూత్ టెస్ట్‌ల్లో సూర్యవంశీ 14 సిక్స్‌లు బాదగా.. ఆయుష్ మాత్రే 9 సిక్స్‌లు కొట్టాడు. వైభవ్ సూర్యవంశీ సెంచరీతో ఈ మ్యాచ్‌లో భారత్ అండర్ 19 జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 43 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లకు 269 పరుగులు చేసింది.

వైభవ్ సూర్యవంశీ(86 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 113 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు. వేదాంత్ త్రివేది(122 బంతుల్లో 15 ఫోర్లతో 96 నాటౌట్) సెంచరీ దిశగా సాగుతున్నాడు. ఆయుష్ మాత్రే(21) నిరాశపర్చాడు. ప్రస్తుతం భారత్ 35 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా అండర్ 19 జట్టు 243 పరుగులకు ఆలౌటైంది. స్టీవెన్ హోగన్(246 బంతుల్లో 8 ఫోర్లతో 92) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో దీపేష్ దేవండ్రన్(5/45) ఐదు వికెట్లు తీయగా.. అమోజిత్ సింగ్, ఖిలన్ పటేల్ చెరో వికెట్ తీసారు.