టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెంచరీ బాదిన అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచాడు. ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నీలో బీహార్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న వైభవ్ సూర్యవంశీ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన సూర్యవంశీ.. నాలుగో మ్యాచ్‌లో 61 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 108 పరుగులు చేశాడు.
ఈ సెంచరీతో సూర్యవంశీ 12 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. 2013లో మహారాష్ట్ర బ్యాటర్ విజయ్ జోల్ 18 ఏళ్ల 118 రోజుల వయసులో (109) సెంచరీ చేసి అతిపిన్నవయస్కుడిగా నిలిచాడు. ఇన్నాళ్లు చెక్కు చెదరకుండా ఉన్న ఈ రికార్డ్‌ను వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. 14 ఏళ్ల 250 రోజుల వయసులో సూర్యవంశీ 108 పరుగులు చేసి ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో వైభవ్ సూర్యవంశీ తర్వాత ఆయుష్ మాత్రే(18 ఏళ్ల 135 రోజులు), ఆయుష్ మాత్రే(18 ఏళ్ల 137 రోజులు), షేక్ రషీద్(19 ఏళ్ల 25 రోజులు) ఉన్నారు.

భారత్ తరఫున టీ20ల్లో మూడు సెంచరీలు నమోదు చేసిన అత్యంత పిన్నవయస్కుడిగా కూడా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. ఈ క్రమంలో తిలక్ వర్మ పేరిట ఉన్న రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల 250 రోజుల వయసులో ఈ ఫీట్ అందుకుంటే తిలక్ వర్మ(22 ఏళ్ల 7 రోజుల వయసు), దేవదత్ పడిక్కల్(22 ఏళ్ల 96 రోజులు), యశస్వి జైస్వాల్(22 ఏళ్ల 126 రోజులు), అహ్మద్ షేహ్‌జాద్(22 ఏళ్ల 127 రోజులు), ఉన్ముక్త్ చంద్(22 ఏళ్ల, 295 రోజులు) తర్వాత ఉన్నారు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ.. రైజింగ్ ఆసియా కప్ టోర్నీలో భారత్- ఏ తరఫున 32 బంతుల్లో శతకం నమోదు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తాజా శతకం సాధించాడు. టీ20ల్లో ఒకే ఏడాది మూడు సెంచరీలు చేసిన బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ 16వ బ్యాటర్‌గా నిలిచాడు. ఇందులో అతిపిన్న వయస్కుడు సూర్యవంశీనే. భారత్ తరఫున ఈ ఫీట్ సాధించిన ఏడో బ్యాటర్. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మలు సూర్యవంశీ కంటే ముందు ఈ ఫీట్ సాధించారు.
ఈ మ్యాచ్‌లో మహారాష్ట్రనే 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బిహార్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ(61 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 108) సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. అనంతరం మహారాష్ట్ర 19.1 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు చేసి గెలుపొందింది. పృథ్వీ షా(30 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 66) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. నీరజ్ జోషి(24 బంతుల్లో 3 సిక్స్‌లతో 30) రాణించాడు.