Duleep Trophy: చేజారిన శతకం.. బ్యాట్ నేలకు కొట్టిన వైభవ్ సూర్యవంశీ!
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ (81 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 92)తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. దులీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వైభవ్ సూర్యవంశీ.. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
బెంగళూరులోని బీసీసీఐ సీఓఈ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ.. వన్డే తరహా బ్యాటింగ్‌తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన ఫియర్‌లెస్ బ్యాటింగ్‌తో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను తలపించాడు. తనకే సాధ్యమైన భారీ సిక్సర్లతో బౌలర్లకు చుక్కలు చూపించాడు.
బౌండరీ లైన్ క్యాచ్‌తో..
42 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో అర్ధశతకం పూర్తి చేసుకున్న వైభవ్.. ఫాస్టెస్ట్ సెంచరీ దిశగా సాగాడు. కానీ హర్ష్‌దూబే బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. బౌండరీ లైన్‌పై అర్షద్ ఖాన్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ ముగిసింది. 8 పరుగుల దూరంలో సెంచరీ చేజారడంతో వైభవ్ సూర్యవంశీ తీవ్ర అసహనానికి గురయ్యాడు. మైదానం వీడే క్రమంలో బ్యాట్‌ను బలంగా నేలకు కొట్టి అసహనం వ్యక్తం చేశాడు.

57 ఏళ్ల రికార్డ్ బద్దలు..
దులీప్ ట్రోఫీ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ బాదిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్రకెక్కాడు. 15 ఏళ్ల 175 రోజుల వయసులో వైభవ్ ఈ ఘనత సాధించి 57 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. 1969లో లక్ష్మణ్ సింగ్ 16 ఏళ్ల 23 రోజుల వయసులో దులీప్ ట్రోఫీలో హాఫ్ సెంచరీ బాదగా.. ఆ రికార్డ్‌ను తాజాగా వైభవ్ సూర్యవంశీ అధిగమించాడు.
కుప్పకూలిన ఈస్ట్ జోన్..
అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి తొలి వికెట్‌కు వైభవ్ 161 పరుగులు జోడించాడు. కానీ అతను ఔటైన తర్వాత ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. మరో 105 పరుగులు మాత్రమే జోడించి 57 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. అభిమన్యు ఈశ్వరన్(69) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సెంట్రల్ జోన్ బౌలర్లలో హర్ష్ దూబే(4/66) నాలుగు వికెట్లు తీయగా.. యశ్ ఠాకూర్, ఆర్యన్ పాండే మూడేసి వికెట్లు పడగొట్టారు. దాంతో ఈస్ట్ జోన్‌కు ఒక్క పరుగు కూడా ఆధిక్యం దక్కలేదు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 20 ఓవర్లలో 3 వికెట్లకు 45 పరుగులు చేసింది. కునాల్ చండేలా(2), ఆర్యన్ జుయాల్(8), రజత్ పాటిదార్(5) విఫలమవ్వగా.. క్రీజులో అమన్ మోకడే(23 బ్యాటింగ్), ఆర్యన్ పాండే(4 బ్యాటింగ్)లు ఉన్నారు. ఈస్ట్ జోన్ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ ఒక వికెట్ పడగొట్టాడు.
సెంట్రల్ జోన్ 266 ఆలౌట్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సెంట్రల్ జోన్.. 80.1 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. రింకూ సింగ్(88 బంతుల్లో 8 ఫోర్లతో 60) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆర్య జుయల్(113 బంతుల్లో 6 ఫోర్లతో 46) హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఈస్ట్ జోన్ బౌలర్లలో ముఖేష్ కుమార్(3/56), అభిజిత్ సర్కార్(3/38) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, మహమ్మద్ కౌనైన్ రెండేసి వికెట్లు తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications