భారత్.. నా బౌలింగ్‌కు భయపడుతోంది: ఉస్మాన్ తారిక్
భారత అభిమానులు తన బౌలింగ్ చూసి భయపడుతున్నారని పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ అన్నాడు. అందుకే తన బౌలింగ్ గురించి ఎక్కువగా చర్చిస్తున్నారని అభిప్రాయపడ్డాడు. అమెరికాతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఉస్మాన్ తారిక్ (3/27) మూడు వికెట్లతో పాకిస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అయితే ఉస్మాన్ తారిక్ బౌలింగ్ శైలి వివాదాస్పద రీతిలో ఉండటంతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా భారత నెటిజన్లు ఉస్మాన్ తారిక్‌ది త్రో బౌలింగ్ అని, ఐసీసీ ఎలా అనుమతిచ్చిందని ప్రశ్నించారు. ఉస్మాన్ తారిక్.. బంతిని విసిరే ముందు తన చేతులను విభిన్న కోణాల్లో తిప్పుతూ.. బ్యాటర్ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తాడు. అతని యాక్షన్‌లో ఒక రకమైన 'హెజిటేషన్'ఉంటుంది. ఆగి ఆగి వేయడం వల్ల బ్యాటర్ టైమింగ్ దెబ్బతింటుంది. చూడటానికి త్రో బౌలింగ్‌లా కనిపిస్తోంది.
భారత్ జట్టుపైనే ఒత్తిడి..
అమెరికాతో మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న ఉస్మాన్ తారిక్ ముందు భారత నెటిజన్ల విమర్శలను ప్రశ్నించగా..తన బౌలింగ్ చూసి వారంతా ఒత్తిడికి గురవుతున్నారని చెప్పాడు. 'ప్రస్తుతం జరుగుతున్న చర్చలు చూస్తుంటే.. ఒత్తిడి మాపై కంటే భారత జట్టుపైనే ఎక్కువగా ఉంటుందని నా అభిప్రాయం. వారు కొన్ని విషయాలను వ్యతిరేకిస్తున్న తీరు చూస్తుంటే అది స్పష్టమవుతోంది. అయితే మీడియాలో ఏం జరుగుతుందో నాకు అనవసరం. నా దృష్టి అంతా నా క్రికెట్, ప్రాక్టీస్‌పైనే ఉంది.'అని ఉస్మాన్ తారిక్ తెలిపాడు.

జట్టు ప్రదర్శనపై వస్తున్న విమర్శలకు సమాధానంగా రికార్డుల గురించి ఆయన ఒక కొత్త కోణాన్ని ప్రస్తావించాడు. 'మనం రికార్డులను కేవలం ఓడిపోవడం ప్రారంభించినప్పటి నుంచి కాకుండా, మొదటి నుంచి లెక్కించాలి. అలా చూస్తే మనకు మంచి రికార్డు ఉందనే విషయం తెలుస్తుంది. అవి కూడా టైటిల్ మ్యాచ్‌లే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. పాత విజయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నప్పుడే జట్టు అసలు బలం తెలుస్తుంది.'అని ఉస్మాన్ పేర్కొన్నాడు.
ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం..
టీ20 ప్రపంచకప్‌లో తదుపరి మ్యాచ్‌ల గురించి మాట్లాడుతూ.. జట్టు అంతా ఒకే లక్ష్యంతో ఉందని స్పష్టం చేశాడు. ప్రపంచకప్ గెలవడమే తమ లక్ష్యమని చెప్పాడు. 'హైప్ గురించి ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మేం విషయాన్ని సింపుల్‌గా ఉంచాలనుకుంటున్నాము. మా ప్లాన్ ప్రకారం ఆడితే విజయం మాదే. భారత్‌తో మ్యాచ్‌ను మరో సాధారణ మ్యాచ్‌లానే చూస్తున్నాం.'అని ఉస్మాన్ తారిక్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications