
సిడ్నీ: వన్డే క్రికెట్ మరణశయ్యపై ఉందని, ఈ ఫార్మాట్ పని అయిపోయిందని ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అన్నాడు. టీ20 క్రికెట్ లీగ్‌లు ఎక్కువైపోవడంతోనే వన్డేలు మూలకు చేరే పరిస్థితులు నెలకొంటున్నాయని ఖవాజా అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వన్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పడంతో ఈ ఫార్మాట్ మనుగడపై చర్చ ఊపందుకుంది. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ కఠినంగా ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. మరోవైపు టీ20 లీగ్‌లు పెరుగుతుండటం కూడా వన్డేల భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపినట్లు విశ్లేషిస్తున్నారు.
తాజాగా ఈ అంశంపై స్పందించిన ఖవాజా సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. 'వన్డే ఫార్మాట్ నెమ్మదిగా మరణం అంచుకు చేరుతోందనేది నా అభిప్రాయం. అయితే ఇప్పటికీ వన్డే ప్రపంచకప్ పోటీలు ప్రతి ఒక్కరినీ సంతోషపెడుతున్నాయి. కానీ ఓ ఆటగాడిగా నేను కూడా వరల్డ్ కప్ టోర్నీలో తప్పితే మిగతా వేళ చూసేందుకు గానీ, ఆడేందుకు గానీ ఆసక్తి చూపను. టీ20 ప్రపంచకప్ ముందున్న సమయంలో వన్డేలు ముఖ్యం కాదు. ఇదే క్రమంలో మూడు ఫార్మాట్‌లను ఆడటం తేలికైన విషయం కాదు. ఓ ప్లేయర్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడాలంటే ప్రయాణిస్తూనే ఉండాలి.
కుటుంబంతో గడపడం కష్టమే. అందుకే వీటిల్లో ఏది ఆడాలనేదానిపై నిర్ణయం తీసుకుని ఎంపిక చేసుకోవాలి. అయితే టెస్టు క్రికెట్ ఎవర్‌గ్రీన్. అదేవిధంగా టీ20 లీగ్‌లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఇక పోతే వన్డే ఫార్మాట్ మూడో స్థానానికి పడిపోయింది'' అని ఖవాజా చెప్పుకొచ్చాడు. ఉస్మాన్ ఖవాజా ఆసీస్ తరఫున కేవలం 40 వన్డేల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. చివరిసారిగా 2019లో వన్డే మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం టెస్టుల్లో ఓపెనర్‌గా కొనసాగుతున్నాడు.