ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా చరిత్ర సృష్టించాడు. శ్రీలంక గడ్డపై డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసీస్ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఉస్మాన్ ఖవాజా 290 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. తన కెరీర్‌లో ఉస్మాన్ ఖవాజాకు ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం.
147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఆసీస్ బ్యాటర్ శ్రీలంక గడ్డపై డబుల్ సెంచరీ చేయలేదు. కోలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో జస్టిన్ లాంగర్ 166 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోర్ కాగా.. తాజాగా ఉస్మాన్ ఖవాజా అధిగమించాడు. శ్రీలంక గడ్డపై అత్యధిక పరుగులు చేసిన ఆసీస్ బ్యాటర్ల జాబితాలో ఉస్మాన్ ఖవాజా, జస్టిన్ లాంగ్(166), డామిన్ మార్టిన్(161), డారెన్ లెహ్‌మన్(153), స్టీవ్ స్మిత్(145)లు ఉన్నారు.

తాజా మ్యాచ్‌లో ఉస్మాన్ ఖవాజా డబుల్ సెంచరీకి తోడుగా స్టీవ్ స్మిత్(141) సెంచరీతో చెలరేగాడు. జోష్ ఇంగ్లీస్ హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆసీస్ ఇప్పటికే 527 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఇదే మ్యాచ్‌లో స్మిత్ 35వ శతకం నమోదు చేయడంతో పాటు 10 వేల పరుగుల మైలురాయి అందుకున్న విషయం తెలిసిందే. దాంతో అతను తన పేరిట పలు రికార్డ్‌లను లిఖించుకున్నాడు. ఆసీస్ తరఫున 35 శతకాలు నమోదు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అతని కంటే ముందు రికీ పాంటింగ్ ఈ ఘనతను అందుకున్నాడు.
అంతేకాకుండా టెస్ట్‌ల్లో 10వేల పరుగుల మైలురాయి అందుకున్న నాలుగో ఆసీస్ బ్యాటర్‌గా.. 15వ అంతర్జాతీయ క్రికెటర్‌గా స్మిత్ నిలిచాడు. గత 14 ఏళ్లుగా ఆసీస్.. శ్రీలంక గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవలేదు. ఈ సారి ఆ ముచ్చట తీర్చుకోవాలనే ఆశతో ఉంది. ఇప్పటికే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన ఆసీస్.. శ్రీలంకను కూడా ఓడించాలనే పట్టుదలతో ఉంది. ఈ సిరీస్‌కు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరం కాగా.. స్మిత్ జట్టును నడిపిస్తున్నాడు.