ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగే సిడ్నీ టెస్ట్ తనకు చివరి మ్యాచ్ అని తెలిపాడు. అలాగే ఆస్ట్రేలియా జట్టులో ఎదుర్కొన్న జాతి వివక్ష గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. ఈ వివక్షను తాను భరించలేకపోతున్నానని, ఇక ఆడలేనని స్పష్టం చేశాడు.
'నేను ఎప్పుడూ కాస్త భిన్నంగానే ఉన్నాను. ఇప్పుడు కూడా . నేను నల్లజాతి ఆటగాడిని. పాకిస్థాన్‌కు చెందిన ముస్లిం వ్యక్తిని. ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ ఆడలేనని చాలా మంది నాతో అన్నారు. కానీ నేను ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించాను. అది నాకు గర్వకారణం. సంతోషం కలిగించే విషయం. అయితే జట్టులోని పలువురు సభ్యులు, మీడియా వారు నాతో వివక్షపూరితంగా వ్యవహరించారు. క్రికెట్‌పై నాకున్న అంకితభావం, నిబద్ధతను శంకించారు. నా సన్నాహకాన్ని ప్రశ్నించారు.
జట్టులో ఇతర ఆటగాళ్లు గాయపడితే వారికి సానుభూతి దక్కేది. అయ్యో పాపం జోష్, నాథన్ లయన్ అనేవారు. కానీ నేను గాయపడితే మాత్రం భిన్నంగా వ్యవహరించేవారు. నాదే తప్పన్నట్లుగా చూసేవారు. ఇతర క్రికెటర్లు మ్యాచ్ ముందు రోజు రాత్రి తప్ప తాగి గాయపడినా వారిని ఒక్క మాట కూడా అనేవారు కాదు. కానీ నా విషయంలో మాత్రం వేరుగా వ్యవహరించేవారు. ఈ విషయంలోనే నేను ఎక్కువగా బాధపడ్డాను.

పెర్త్ టెస్ట్‌లో నా వెన్నుకు గాయమైంది. విపరీతమైన నొప్పితో బాధపడ్డను. అది నా నియంత్రణలో లేని విషయం. కానీ ఆ సమయంలో మీడియా, మాజీ ఆటగాళ్లు నాపై దారుణంగా విమర్శలు గుప్పించారు. ఒకటి రెండు రోజులు అంటే నేను భరించేవాడని. కానీ ఆ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.
నా సన్నదతపై కూడా విమర్శలు గుప్పించారు. జట్టు పట్ల అంకిత భావం లేదని, తన గురించి మాత్రమే ఆలోచిస్తాడని, స్వార్థపరుడని, గోల్ఫ్ పోటీలు ఆడుతున్నాడని, ప్రాక్టీస్ చేయడని, సోమరిపోతని విమర్శించారు. ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఎవర్నీ కూడా ఇంతా విమర్శించలేదు. అడిలైడ్ టెస్ట్‌కు పక్కనపెట్టినప్పుడే నా కెరీర్ ముగింపు దశకు చేరిందనే విషయం అర్థమైంది. ఆటను వదిలేయాల్సిన సమయం ఆసన్నమైందని నాకు అనిపించింది.'అని ఉస్మాన్ ఖవాజా ఆవేదన వ్యక్తం చేశాడు.
పాకిస్థాన్‌లో పుట్టిన ఉస్మాన్ ఖవాజా.. ఆస్ట్రేలియాలో స్థిరపడి ఆ జట్టు తరఫున క్రికెట్ ఆడిన తొలి ముస్లింగా రికార్డ్ సాధించాడు. కెరీర్ ఆరంభంలో ఇబ్బందులు పడిన ఖవాజా.. తర్వాత ఓపెనర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా గెలిచిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ విషయంలో తన వంతు పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో మెల్‌బోర్న్ టెస్ట్‌లో 82 పరుగులు చేశాడు. 2025లో 18 ఇన్నింగ్స్‌ల్లో 614 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు 87 టెస్ట్‌లు, 40 వన్డేలు, 9 టీ20లు ఆడి.. మొత్తంగా 8001 పరుగులు సాధించాడు.