టీమిండియా సెన్సేషన్ రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఖరారైనట్లు తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం రింకూ సింగ్‌ను రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 గెలుచుకున్న భారత జట్టులో రింకూ కనబరిచిన అద్భుత ప్రదర్శనతో పాటు అతని అంకితభావానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఇండియా టుడే పేర్కొంది.
ఈ మెగా టోర్నీ సమయంలోనే రింకూ సింగ్ తండ్రి మరణించిన సంగతి తెలిసిందే. భారత జట్టు తరఫున టీ20 ప్రపంచకప్ ఆడుతూనే రింకూ సింగ్.. గ్రేటర్ నోయిడాలో క్యాన్సర్‌తో చికిత్స పొందిన తన తండ్రి వద్దకు నిరంతరం ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. చివరకు ఆయన మరణించినా.. రింకూ సింగ్ కార్యక్రమాలను ముగించుకొని వెంటనే జట్టులో చేరాడు. ఉత్తరప్రదేశ్‌లో రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్ పోస్ట్ గ్రూప్-ఏ కిందికి వస్తుంది. జీతం, అలవెన్సులతో కలిపి రూ.56,100 నుంచి రూ.1,77,500 చేతికి అందుతుంది.

అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శన కనబరిచిన తమ క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు నగదు బహుమతులు, ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారాలను అందజేస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. లోక్ భవన్‌లో జరిగే సన్మాన వేడుకలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ నియామక పత్రాలను అందజేస్తారు.
రింకూ సింగ్: రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్ (RSO).
రాజ్‌కుమార్ పాల్ (హాకీ): డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP). (పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన హాకీ టీమ్‌లో రాజ్‌కుమార్ పాల్ కీలక సభ్యుడు.)
ప్రవీణ్ కుమార్ (పారా హైజంప్): పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్- డీఎస్పీ
అజిత్ సింగ్ (పారా జావలిన్ త్రో): డిస్ట్రిక్ట్ పంచాయతీ రాజ్ ఆఫీసర్.
సిమ్రాన్ (పారా 200 మీటర్లు): డిస్ట్రిక్ట్ పంచాయతీ రాజ్ ఆఫీసర్.
ప్రీతీపాల్ (పారా అథ్లెటిక్స్): బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (BDO).
లక్ష్మణ్ & రాణి లక్ష్మీబాయి అవార్డులు (2024-25): మొత్తం 9 మంది క్రీడాకారులకు ఈ పురస్కారాలు దక్కుతాయి. వీరికి రూ. 3.11 లక్షల నగదు బహుమతితో పాటు కాంస్య విగ్రహం అందజేస్తారు. 14 మంది ప్లేయర్లకు మొత్తం రూ. 1.64 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నారు. ఏకలవ్య స్పోర్ట్స్ ఫండ్ ద్వారా 19 మంది క్రీడాకారులకు రూ. 8.75 లక్షల ఆర్థిక సహాయం అందజేయనున్నారు.